BRS Leaders Comments: అత్యుత్సాహం ప్రదర్శిస్తే హాట్‌టాపిక్‌గా మారడం ఖాయం!

ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా కనిపించే పల్లా ఎందుకో కాస్త ఆవేశపడ్డారు. కాలం కలిసొస్తే జనగామలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో దిగాల్సిన రాజేశ్వరరెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై మాట జారారు.

BRS Leaders Controversial Comments: మాటే మానవ సంబంధాలకు మూలం. మాటతో ఎందరో స్నేహితులు అవుతారు. మరెందరో శత్రువులుగా మారుతారు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. అలాంటివారికి శత్రువులే ఉండరు. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటే ఎవరికైనా ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి. మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. వాగ్భాషణ మొక్కటే మనిషికి ఆభరణం అంటారు పెద్దలు.. ఇలాంటి మంచి మాటలు మన నేతలు ఒక్కటీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు నోరు జారుతూ కోరి కష్టాలు తెచ్చుకుంటున్న నాయకులే ఎక్కువయ్యారు. నలుగురిలో ఉన్నప్పుడు నోరు అదుపు చేసుకోలేక వివాదాలకు కేంద్రంగా మారారు కొందరు బీఆర్ఎస్ నాయకులు. వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ (hot topic) అవుతున్న నేతలు.. ఎలాంటి చిక్కుల్లో పడుతున్నారో చూద్దాం.

మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానికన్నా ఎలా చెప్పారనే అంశమే ఇంట్రస్టింగ్గా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా వస్తుంది. దురదృష్టవశాత్తూ కొందరు నాయకులు భావ వ్యక్తీకరణలోనే బోల్తా కొడుతున్నారు. సమయం.. సందర్భం చూసుకోకుండా నోరు జారుతూ కష్టాల్లో కూరుకుపోతున్నారు. బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర రైతు బంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి (Palla Rajeshwar Reddy) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా కనిపించే పల్లా ఎందుకో కాస్త ఆవేశపడ్డారు. కాలం కలిసొస్తే జనగామలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో దిగాల్సిన రాజేశ్వరరెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై మాట జారారు. ఇంకేముందు ఇఫ్పుడదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. వ్యతిరేకులకు ఇప్పుడు ఇదే అస్త్రంగా మారింది. ప్రతిపక్షంలో ఉంటే మొరుగుతారని.. అధికార పార్టీలోకి చేర్చుకున్నామని.. బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలపై పల్లా చేసిన వ్యాఖ్యలు పార్టీని, అధినేత కేసీఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తన మాటలకు తానెంత వివరణ ఇచ్చుకున్నా ఒక్కసారి నోరు జారడం పల్లాను ఇరకాటంలో పడేసింది.

గోడలకు చెవులున్నట్లు.. ఇప్పుడు మన సెల్‌ఫోన్లకు పెద్ద పెద్ద కళ్లు.. ప్రపంచం అంతా వినిపించేటంతటి లౌడ్ స్పీకర్లు ఉన్నాయి. పొరపాటున చిన్నమాట తూలినా క్షణాల్లో వైరల్ అయిపోవడం ఖాయం. మాట జారిన తర్వాత చింతించే కన్నా.. ముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం నేతలు అలవాటు చేసుకోవాలి. ఇది ఒక్క ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కోసమే కాదు. బీఆర్ఎస్ లో ఈ మధ్య ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేతలు ఇంకొందరు ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల హాట్ హాట్‌గా మారిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao). తిరుపతిలో దేవుడి దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే మైనంపల్లి.. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుపై (Harish Rao) అక్కసు వెళ్లగక్కారు. తాను పార్టీని ఉద్దేశించి విమర్శలు చేయలేదని.. తన మాటలు సమర్థించుకోవాలని చూసినా.. హరీశ్‌రావ్‌పై వ్యక్తిగత విమర్శలను సాధారణ కార్యకర్త కూడా నిరసించారంటే.. ఎమ్మెల్యే మాటలు ఎదుటి వ్యక్తులను ఎంతలా గాయపర్చాయో అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యలతో ఆయనకు కేటాయించిన టిక్కెట్ కూడా రద్దు చేసే పరిస్థితికి దారితీస్తోంది. ఇక బీఆర్ఎస్‌లో తరచూ మాటలు తూలుతూ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసే నేతగా ఎమ్మెల్సీ పాడి కౌశివ్‌రెడ్డి నిలుస్తున్నారు.

Also Read: టిక్కెట్లు దక్కినా బీఆర్ఎస్ నేతల్లో సరికొత్త టెన్షన్.. ఎందుకంటే?

ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండి హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు పేటెంట్ తీసుకున్నట్లు పార్టీకి చికాకులు తెస్తున్నారు. హాట్ కామెంట్లు చేస్తే ప్రచారం వస్తుందనో.. లేక అనాలోచితంగానో ఎప్పుడూ విమర్శకులకు దొరికిపోతున్నారు కౌశిక్‌రెడ్డి. గవర్నర్ తమిళిసై పైన ఓ సారి మాట జారి తర్వాత క్షమాపణలు చెప్పిన కౌశిక్‌రెడ్డి.. ఆ తర్వాత హుజురాబాద్ లో ఓ వ్యక్తి సెల్‌ఫోన్ లాక్కుని ఆయన సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం వివాదాస్పదమైంది. కౌశిక్‌రెడ్డి తీరుకు నిరసనగా ఆ సామాజిక వర్గం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. ఒకదశలో ఇదే కారణంగా కౌశిక్ రెడ్డి టిక్కెట్టుకే ఎసరు వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

Also Read: మహేందర్‌రెడ్డిని అందలం ఎక్కించింది అందుకేనా.. ఎన్నికల వేళ కేసీఆర్ కీలక ఎత్తుగడ!

ఇక తాజాగా హైదరాబాద్ నగరంలో స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబుపై చేయి చేసుకోవడంపైనా దుమారం రేగింది. చుట్టూ వందలాది మంది జనం ఉన్నా చూసుకోకుండా.. ఓ మంత్రి స్థాయి వ్యక్తి మరో నేతపై దాడికి దిగడం తీవ్ర విమర్శల పాలైంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన రాజేశ్‌బాబుకి మంత్రి తలసానికి వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదు. కానీ, స్టీల్ బ్రిడ్జి ప్రారంభం సమయంలో తనను దాటి ముందుకు వెళుతున్నారనే ఏకైక కారణంతో సహనం కోల్పోయి చేయి చేసుకున్నారని మంత్రి తలసానిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో అటు లంబాడీ వర్గంతోపాటు ఉద్యమకారులు కూడా మంత్రిపై మండిపడుతు రోడ్డెక్కారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆ సంఘటనపై తలసాని వివరణ ఇచ్చినా.. క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Also Read: మూడు చోట్ల దరఖాస్తు చేసిన పొంగులేటి.. మిగతా రెండు స్థానాలు వారిద్దరి కోసమేనా?

ఈ సంఘటనల్నీ అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారాయంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు మందు ఊహించని ఈ వివాదాలు బీఆర్ఎస్ మైలేజ్‌ను డ్యామేజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. ఈ అనుభవం నుంచైనా పాఠాలు నేర్చుకుని నాయకులు నోటిని అదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు. అసలే ఎన్నికల కాలం కావడంతో అందివచ్చిన అవకాశాలను వ్యతిరేకులు ఇట్టే వైరల్ చేసేస్తున్నారు. సో.. మితంగా, హితంగా మాట్లాడి గౌరవం తెచ్చుకోవడమే నేతల ముందున్న అతిపెద్ద సవాల్.. అలా కాకుండా ఆవేశంగా మాట్లాడటమో.. అత్యుత్సాహం ప్రదర్శించడమే చేస్తే హాట్‌టాపిక్‌గా మారడం ఖాయం.

ట్రెండింగ్ వార్తలు