Weatehr Updates : తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలి..

Weatehr Updates : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

Changes in weather conditions in Telangana state

Weatehr Updates : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరుస తుఫాన్లు కారణంగా ఇటీవల పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా మళ్లీ ఎండ తీవ్రత పెరిగింది. అయితే, ప్రస్తుతం వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉదయం 9గంటల వరకు.. రాత్రి సాయంత్రం 6గంటల నుంచి చలి వణికిస్తోంది. రానున్న మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Also Read : Telangana Farmers : తెలంగాణలోని రైతులకు భారీ ఊరట.. 365 మండలాల్లో రుణాల వసూళ్లకు బ్రేక్!

మొన్నటిదాకా ఉక్కపోతతో పాటు 20 డిగ్రీలకుపైగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. రెండు రోజుల్లోనే ఒకేసారి 15డిగ్రీల దిగువకు చేరాయి. ఏకంగా 21 జిల్లాల్లో 14 డిగ్రీల రేంజ్ లోనే టెంపరేచర్లున్నాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట, అదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాద్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో 14.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో 15డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీస్తాయని నిపుణులు చెబుతున్నారు. టీజీడీపీఎస్ అంచనాల ప్రకారం.. రాత్రి ఉష్ణోగ్రతలు 13డిగ్రీల దిగువకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని, వచ్చే మూడు రోజుల్లో అది 11-12 డిగ్రీల మేర రికార్డయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని, అందుకు తగిన విధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

మరోవైపు ఈనెల 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆ తరువాత 24 గంటల్లో అది మరింత బలపడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం అంచనా వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల, వరంగల్, జగిత్యాల, మంచిర్యాల, అదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 12డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు.