Hyderabad: ఎంతకు తెగించార్రా.. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు కేటుగాళ్ల కొత్త ఎత్తుగడ

పేరు మాత్రమే చెప్పిన అతడు మిగతా వివరాలు చెప్పేందుకు వెనుకాడాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారుని గమనించగా స్టీరింగ్ బటన్ పక్కనున్న ఓ బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ చేంజ్ అవడాన్ని గమనించారు.

  • Published On : April 12, 2026 / 10:24 PM IST

Hyderabad: ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు టెక్నాలజీని వాడేస్తున్నారు కేటుగాళ్లు. టెక్నాలజీ సాయంతో ఏకంగా క్షణాల్లో నెంబర్ ప్లేట్లను చేంజ్ చేస్తున్నారు. ఈ రకం మోసాల గురించి తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో ఈ మోసం బయటపడింది. జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు రాత్రి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారుని ఆపారు. కారు నడుపుతున్న వ్యక్తికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ఇందులో అతడి ఆల్కహాల్ స్థాయి 137 బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్) గా నమోదైంది. దీంతో అతడి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే పేరు మాత్రమే చెప్పిన అతడు మిగతా వివరాలు చెప్పేందుకు వెనుకాడాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారుని గమనించగా స్టీరింగ్ బటన్ పక్కనున్న ఓ బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ చేంజ్ అవడాన్ని గమనించారు. ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లో పోలీసులకు సహకరించకపోవడం, తప్పుడు నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న గౌతమ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.