Government Employees PRC : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఆర్సీపై రేపే ప్రకటన!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Telangana Government Employees PRC : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. సుమారు రెండున్నరేళ్లుగా ఉద్యోగులను ఊరిస్తున్న వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రేపే.. సీఎం కేసీఆర్ స్వయంగా గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. వేతన సవరణతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం మాదిరిగానే తెలంగాణ ఉద్యోగులకు అందిస్తున్న ఈహెచ్ఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తదితర అంశాలపైనా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై పీఆర్సీపై చర్చించారు సీఎం కేసీఆర్‌. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతి కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. దీంతో కనీసం 29 లేదా 33 శాతం వరకు ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఇప్పుడా హామీని నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలనూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో గులాబీదళపతి సంతోషంగా ఉన్నారు. త్వరలోనే పీఆర్సీపై ప్రకటన చేస్తానని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు కూడా. ఇంతలో గులాబీ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ సీటును గెల్చుకోవడమే కాకుండా, మరో సీటునూ దక్కించుకుంది. ఈ జోష్‌కు తోడు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో.. పీఆర్సీపై ప్రకటన ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం సాధారణ ప్రకటన చేస్తుందా.. లేకపోతే రెండు రోజుల్లో అసెంబ్లీలో సీఎం ప్రకటిస్తారా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏదేమైనా పీఆర్సీపై గుడ్ న్యూస్ వస్తుందన్న ఆశతో ప్రభుత్వ ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు