రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుపట్టారు. కృష్ణా – గోదావరి జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్ట్ 20 తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఉన్నతస్థాయి ఇరిగేషన్ సమావేశం అభిప్రాయపడింది. ఇరిగేషన్ సమీక్షలో కేంద్ర వ్యవహారంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొన్న జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆగస్టు 5న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్‌లో జలవనరులశాఖ నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని వాయిదా వేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమవయ్యింది. ఆగస్టు 5న ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో.. ఆరోజు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడం కుదరదని అధికారులు తెలిపారు. ఆగస్టు 20 తర్వాత సమావేశం ఉండేలా మరో తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది.
అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్…. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా – గోదావరి జలాల్లో మన హక్కును కోల్పోబోమని తెలిపారు. నీటి వాటాను కాపాడుకుంటామని చెప్పారు. నీటి వాటా కోసం ఎంతటి పోరాటానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.
ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని కేసీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.
ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలని… వివాదాలు ఉన్నప్పుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలన్నారు. పునర్విభజన చట్టం సెక్షన్ -13 ప్రకారం… జల వివాదాలను పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని ఉందన్నారు. కేంద్రం ఈ విషయంలో అంటీముట్టనట్టు ఉంటోందని… ఈ వైఖరిని కేంద్రం ఎప్పటికైనా మార్చుకోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ తీరుతో తెలుగు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని.. నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిదికాదని అన్నారు.
పాలమూరు -రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి… వాటిని పూర్తి చేసి తీరాలని సమావేశం నిర్ణయించింది.
అవాంతరాలను లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలని కేసీఆర్ సూచించారు. మొత్తానికి కృష్ణా, గోదావరి జలాల్లో.. తెలంగాణ వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమగ్రంగా.. సమర్థవంతంగా వినియోగించుకోవాలని.. ఇందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని సమావేశంలో నిర్ణయించారు.