Cm Revanth Reddy – Ntr Statue: మాకు ఇందిరా గాంధీ ఎంతో.. ఎన్టీఆర్ కూడా అంతే- సీఎం రేవంత్
ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని విమర్శిస్తున్నారు. నకిలీల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
- Naveen
- Updated on- May 28, 2026 / 09:26 PM IST
Cm Revanth Reddy – Ntr Statue: దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలుగు జాతి అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాలను తలచుకోవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కును కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను మొదటగా స్మరించుకోవాలన్నారు. ఆ తర్వాత భూ సంస్కరణలు తెచ్చి పేదలకు పంచి హక్కులు కల్పించిన ఇందిరా గాంధీని తలచుకోవాలన్నారు. ఇందిర తర్వాత నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎన్టీఆర్ ను స్మరించుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. మానవ మనుగడ ఉన్నంత కాలం ఈ ముగ్గురు జాతి రత్నాలను స్మరించుకోవాల్సిందే అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటని కొందరు మాట్లాడుకుంటున్నారు. విమర్శలు చేస్తున్నారు. కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించ దగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు. రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవిత కాలం గుర్తుండిపోయే జ్ఞాపకం. తుమ్మల, మండవ, కడియం, మోత్కుపల్లి లాంటి ఎందరో నాయకులను తెలంగాణకు అందించిన ఘనత ఎన్టీఆర్ ది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా గుర్తించి నాయకుడిని చేసింది ఎన్టీఆర్. వాళ్ళే కాదు ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని విమర్శిస్తున్నారు.
కొందరు నకిలీల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సన్న బియ్యం అందించే స్ఫూర్తి వెనుక అన్నగారు అందించిన రూ.2 కిలో బియ్యం పథకం ఉంది. ఆడ బిడ్డలకు చీరలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించడంలో ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంది. బలహీన వర్గాలు పాలకులుగా మారడం వెనుక అన్నగారి సహకారం ఉంది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదలు ఆత్మగౌరవంతో బతికే అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్ ది.
ఇందిరమ్మ ఒక తరం అయితే.. ఎన్టీఆర్ ఒక శకం..
మా ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాల్లో ఇందిరమ్మ, ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపిస్తుంది. ఇందిరమ్మ ఒక తరం అయితే.. ఎన్టీఆర్ ఒక శకం.. ఆ ఇద్దరి స్ఫూర్తితో ప్రజా పాలన అందిస్తున్నాం. అన్నగారు ఆనాడు ఆడ బిడ్డలకు కల్పించిన హక్కుల స్ఫూర్తిగా కోటి మంది ఆడ బిడ్డలను కోటీశ్వరులు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. రైతును రాజును చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆనాడు రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్ కల్పిస్తే అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ ది. అన్నగారి స్ఫూర్తితోనే నిరుపేదలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం. మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
మహిళల కోసం 60 వేల కోట్లు ఖర్చు చేశాం. ఉప ఎన్నికల్లో మీ అందరూ అండగా ఉండటం వల్లే ప్రజా పాలన ముందుకు సాగుతోంది. భవిష్యత్ లోనూ మీ సహకారం ఇలాగే కొనసాగాలి. 2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నాం. ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ అమీర్ పేట్ మైత్రీవనం సర్కిల్ లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ప్రతి ఒక్కరికీ ‘ఆల్ ఇన్ వన్’ కార్డు.. దేశంలోనే ఫస్ట్ టైమ్
