Alai Balai 2024: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ ప్రముఖులు.. సీఎం రేవంత్, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బండారు దత్తాత్రేయ తెలంగాణ సంస్కృతిని కాపాడేలా కృషి చేస్తున్నారని, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం అభినందనీయమని ..

CM Revanth Reddy and Kishan Reddy

Bandaru Dattatreya Alai Balai 2024 : హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ అధ్యక్షతన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ‘అలయ్ బలయ్’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండగ దసరా, ఈ పర్వదినాన గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మి చెట్టు అని.. అలయ్ బలయ్ అంటే గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: మూసీ అంశంలో పోరాటంపై డైలమాలో బీఆర్ఎస్? ఆ భయమే కారణమా..

బండారు దత్తాత్రేయ తెలంగాణ సంస్కృతిని కాపాడేలా కృషి చేస్తున్నారని, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన నుంచి వారసత్వంగా తీసుకొని విజయలక్ష్మీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ‘అలయ్ బలయ్’ స్ఫూర్తిగా పనిచేసిందని రేవంత్ అన్నారు.

 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నేతల మధ్య విమర్శలు సహజమే. కానీ, ఇప్పుడు వాడుతున్న భాష మంచిది కాదు. ఇకనైనా రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. విమర్శలు, ప్రతి విమర్శలు అందరూ మెచ్చే విగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, విమర్శలు మంచిది కాదని కిషన్ రెడ్డి అన్నారు. ‘అలయ్ బలయ్’ లాంటి కార్యక్రమాలు మున్ముందు రోజుల్లోనూ దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.