జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు.. సంపత్‌కి ఎందుకివ్వలేదు?: మందకృష్ణ

జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు, అలంపూర్‌లో ఓడిపోయిన సంపత్‌కి నాగర్ కర్నూల్ టికెట్ ఎందుకివ్వలేదు?

Manda Krishna Madiga: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేశారని, ఆయన రాజకీయ మూల్యం చెల్లించకోక తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులతో కలిసి సోమవారం బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో మీడియాతో మాట్లాడారు. మూడు లోక్‌స‌భ‌ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి వైఖరి ఏంటో తమకు అర్థమవుతోందన్నారు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని మందకృష్ణ పునరుద్ఘాటించారు.

”తన రాజకీయ ఎదుగుదలలో మాదిగలు ప్రధానపాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఎక్కడ పోటీ చేసినా తన గెలుపునకు మాదిగలు సహకారం అందించారని స్వయంగా ఆయనే అన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు. రేవంత్ రెడ్డి వల్ల మోత్కుపల్లికి అవమానం జరిగింది. తన ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏనాడు జరగని అవమానాలు రేవంత్ రెడ్డి వల్ల మోత్కుపల్లికి జరిగాయి.

తెలంగాణలో మాదిగలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీలో వివేక్ కుటుంబానికి మూడు టికెట్లు ఎలా ఇచ్చారు? మల్లు భట్టివిక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా.. మల్లు రవికి ఎలా టికెట్ ఇచ్చారు? కడియం శ్రీహరి కులం గురించి విచారణ జరపాలని రేవంత్ రెడ్డి గతంలో అన్నారు. వరంగల్‌లో ఎంతో మంది మాదిగ జాతి నాయకులు ఉండగా కడియం కావ్యకు టికెట్ ఎందుకు ఇచ్చారు? మాదిగ జాతికి చెందిన సంపత్ కుమార్‌కి టికెట్ ఎందుకు ఇవ్వలేదు?

Also Read: 9 సీట్లు ఒకే కులానికా.. ఇదెక్కడి అన్యాయం?: రేవంత్‌పై విరుచుకుపడ్డ మోత్కుపల్లి

జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు, అలంపూర్‌లో ఓడిపోయిన సంపత్‌కి నాగర్ కర్నూల్ టికెట్ ఎందుకివ్వలేదు? వాయిస్ ఉన్న దళిత యువ నాయకులను ఎదగనివ్వడం లేదు. తెలంగాణలో ఉండే మాదిగలు పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీపై నిరసన తెలపాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాదిగలకు చేసిన ద్రోహంపై మే 4న ఒక్క రోజు అందరం కలిసి దీక్ష చేయాలని పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహంపై 119 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహిస్తామ”ని మందకృష్ణ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు