Revanth Reddy: కరువు కోసం క్షుద్ర పూజలు.. దుర్మార్గులకు అష్టదిగ్బంధనం ఖాయం.. కూకట్‌పల్లిలో సీఎం సంచలన కామెంట్స్
రాష్ట్రంలో తీవ్రమైన కరువు రావాలని కోరుకుంటూ కొంతమంది దుర్మార్గులు ఏకంగా క్షుద్ర పూజలు కూడా చేశారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన ఆరోపణ చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 13, 2026 / 08:21 PM IST
CM Revanth Reddy comments on brs party
- కరువు కోసం క్షుద్ర పూజలు
- కూకట్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి
- వికాసం వైపే తెలంగాణ ప్రయాణం
Revanth Reddy: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిరమ్మ ఇండ్లు” టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల కుట్రలు, దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ పాలన సాగుతోందని, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరువు కోసం క్షుద్ర పూజలు:
కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి, రాష్ట్రంలో తీవ్రమైన కరువు రావాలని కోరుకుంటూ కొంతమంది దుర్మార్గులు ఏకంగా క్షుద్ర పూజలు కూడా చేశారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన ఆరోపణ చేశారు. అయితే తమ ప్రభుత్వ మంచి మనసుకు, సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం తోడైందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసాయని ఆయన వ్యాఖ్యానించారు.
దుర్మార్గులకు అష్టదిగ్బంధనమే:
కుటిల బుద్ధితో రాష్ట్ర వినాశనం కోరేవారికి ఆ క్షుద్ర పూజలే తిరిగి అష్ట దిగ్బంధనంగా మారతాయని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎంతమంది కుట్రలు పన్నినా, ప్రజల అండదండలు ఉన్నంత వరకు తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని అన్నారు. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నిలకడగా తీసుకెళ్తానని ఆయన పూర్తి ధీమా వ్యక్తం చేశారు.
