రాజీనామా లేఖతో గన్‌పార్కుకు వెళ్లిన హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

Harish Rao: అసలు రాజీనామా లేఖ అలా ఉండదని చెప్పారు. కేసీఆర్ చెప్పిన..

రాజీనామా లేఖతో హైదరాబాద్ అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్కుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీశ్ రావుకు అమరవీరుల స్తూపం గుర్తుకువస్తుందని చెప్పారు. ఆయన మోసానికి ముసుగు అమరవీరుల స్తూపమని తెలిపారు.

హరీశ్ రావు ఇన్నాళ్లు ఎన్నడైనా అమరుల స్తూపం వద్దకు వెళ్లారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓ పెద్ద లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని తెలిపారు. అసలు రాజీనామా లేఖ అలా ఉండదని చెప్పారు. కేసీఆర్ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని చెప్పారు.

హరీశ్ రావు రాజీనామా అంటూ తెలివి ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఆయన తెలివి అరికాళ్లలోకి జారినట్టుందని ఎద్వేా చేశారు. హరీశ్ రావు సవాల్ ను కచ్చితంగా స్వీకరిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని, రాజీనామా రెడీగా పెట్టుకోవాలని హరీశ్ రావుకి తెలిపారు.

కాగా, ఆగస్టు 15లోగా ఏకకాలంలో రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు ఇస్తారా? అని హరీశ్ రావు సవాలు విసిరారు. రైతు రుణమాఫీ, 6 గ్యారెంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే గాకుండా ఉప ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు.

Also Read: టీడీపీకి షాక్.. పార్టీకి యనమల కృష్ణుడు రాజీనామా

ట్రెండింగ్ వార్తలు