CM Revanth Reddy: తెలంగాణపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం.. రానున్న 8 నెలలు అత్యంత కీలకం.. సీఎం రేవంత్ కీలక హెచ్చరిక

ఎల్‌నినో ప్రభావంతో దేశీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(CM Revanth Reddy) తీవ్రంగా అప్రమత్తమైంది.

CM Revanth Reddy high-level review meeting on El Nino crisis in Telangana

CM Revanth Reddy: ఎల్‌నినో ప్రభావంతో అంతర్జాతీయంగా, దేశీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అప్రమత్తమైంది. భవిష్యత్తులో వచ్చే నీటి, విద్యుత్, వ్యవసాయ రంగాల సంక్షోభాలను అధిగమించడానికి తక్షణ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నతాధికారులను తీవ్రంగా ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. రాబోయే ఎనిమిది నెలలు రాష్ట్రానికి అత్యంత కీలకమని స్పష్టం చేశారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ నిర్వహణలో పక్కా ప్రణాళికలు రూపొందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

AP Liquor Policy: ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం.. 271 షాపులకు రెండో విడత నోటిఫికేషన్.. దరఖాస్తులకు లాస్ట్ డేట్ ఇదే!

ప్రత్యేక వార్ రూమ్.. 24 గంటలూ విద్యుత్, నీటి సరఫరా పర్యవేక్షణ:

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఎంతటి ఖర్చుకైనా సిద్ధంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో విద్యుత్ లభ్యత తగ్గకుండా చూడటం ప్రధానమని స్పష్టం చేశారు. రైతులు వేసిన పంటలు చేతికి వచ్చే వరకు చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని, ప్రజల్లో పొదుపుపై సినిమా, మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దసరా పండుగ ముగిసిన వెంటనే గ్రామీణ స్థాయి నుంచి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.

215 కరువు మండలాలు.. కేంద్రానికి రూ. 20,000 కోట్ల ప్యాకేజీ తీర్మానం:

రాష్ట్రంలో దాదాపు 215 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరుతూ త్వరలోనే అసెంబ్లీ తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద 125 రోజులకు అదనంగా మరో 50 రోజుల పనిదినాలు కల్పించాలని, ఆ అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వెల్లడించారు. పరిస్థితిపై త్వరలోనే మంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహిస్తామని, అవసరమైతే అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.