Bhu Bharati Act: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పోర్టల్ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా తొలుత మూడు మండలాల్లో ఈ పోర్టల్ ను అమలు చేయనున్నారు. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి మార్పులు చేర్పులు చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు.
బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్. ధరణి రైతులకు పీడకలగా మారిందన్నారు. ధరణి కారణంగా జంట హత్యలు జరిగాయన్నారు. రెవెన్యూ సిబ్బందిని దోపిడీ దారులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్న సీఎం రేవంత్.. చట్టాలని కొందరికి చుట్టాలుగా మార్చి వేలాది ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. ధరణిపై ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
నిజాం కాలం నాటి నుంచి ఉన్న భూ చట్టాలను పరిశీలించి భూ భారతి తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూవివాదాలను పరిష్కరించేలా పోర్టల్ ను రూపొందించామన్నారు. ఈ చట్టాన్ని ప్రజల వద్దకు చేర్చే బాధ్యత రెవెన్యూ సిబ్బందిదేనన్న రేవంత్.. రెవెన్యూ శాఖపై ఉన్న అపోహలను తొలగించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వంటి చరిత్రాత్మకమైన రోజు భూ భారతి చట్టం అమల్లోకి రావడం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో చట్టాలు వచ్చాయి కానీ, భూ భారతి ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారాయన.
ధరణి పోర్టల్ రైతులకు ప్రయోజనకరంగా లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దొరలు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్ తయారు చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసే చట్టం చేసిందన్న మంత్రి పొంగులేటి.. ధరణి అరాచక ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిందన్నారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here