Cm Revanth Reddy: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం, ఆదిలాబాద్‌కు నీళ్లందిస్తాం- సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టు ఏర్పాటునకు కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామన్నారు.
- Naveen
- Published On : April 6, 2026 / 06:03 PM IST
- జూన్ 2లోపే ఎయిర్ పోర్టుకు శిలాఫలకం వేస్తాం
- దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను త్వరలోనే ఆదిలాబాద్ లో ప్రారంభిస్తాం
- మరోసారి కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది
- 2034 వరకు ప్రజా పాలన కొనసాగుతుంది
Cm Revanth Reddy: తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను తిరిగి చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తాగు, సాగు నీటిని అందిస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు తానే వస్తానని కూడా చెప్పారు. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టు ఏర్పాటునకు కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
”ఆదిలాబాద్ జిల్లా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. నాటి నుండి నేను, భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాపైనే ప్రత్యేక దృష్టి సారించి అన్ని కార్యక్రమాలను ఇక్కడి నుండి మొదలు పెట్టాం. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రణాళికలు లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా ఇంకా వెనకబడి ఉంది. అపారమైన వనరులు ఉన్నప్పటికీ ఆదిలాబాద్ ప్రజలు వెనకబడే ఉన్నారు. ఆదివాసీ పటేళ్లకు ఇచ్చిన హామీలు నెరువేరుస్తున్నాం. పాలమూరు సమానంగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తాం.
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. విపక్షాలను మేము ఎప్పుడూ శత్రువులుగా చూడం. విపక్ష పార్టీ నేతలు మాకు రాజకీయ ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు. అభివృద్ధి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. విపక్ష నేతలు చెప్పిన సమస్యలు తీరుస్తున్నాం. ఆనాడు సీఎం, మంత్రులు వస్తున్నారంటే.. విపక్ష నేతలను అరెస్ట్ చేసి కట్టడి చేసేవారు. గత ప్రభుత్వంలో విపక్ష నేతలను గౌరవించిన సంస్కృతి లేదు. కానీ.. మేము విపక్ష నేతలను వేదికపైకి పిలిచి గౌరవిస్తున్నాం. మాది ప్రజాస్వామిక పాల. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. మా ఎంపీ, ఎమ్మెల్యేలు లేని చోట కూడా నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నాం. నిర్మల్ లో మా ఎమ్మెల్యే లేకపోయినా 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం.
ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్, యూనివర్సిటీ..
మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి 10వేల కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఆహనా పెళ్ళంట సినిమా తరహాలో కోడిని వేలాడదీసినట్టు ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపించారు. 3 కోట్ల 17 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. జిల్లా, రెవెన్యూ, మండల, గ్రామాల సరిహద్దులు 2027 వరకు మార్చొద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం.. కులేశ్వరం అయింది. తుమ్మిడిహెట్టి నుండి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తాం. కేంద్రంతో మాట్లాడి.. జూన్ 2న ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రారంభిస్తాం. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్ లో ప్రారంభిస్తాం. భూసేకరణ జరుగుతుంది. ఆదిలాబాద్ లో త్వరలోనే యూనివర్సిటీని ప్రారంభిస్తాం.
నా మనవడికి బాసర క్షేత్రంలోనే అక్షరాభ్యాసం చేయించాం. బాసర ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్లు కేటాయించాం. ఇంకా అవసరం అయితే కేటాయిస్తా. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాల్లో భాగంగా ఆలయాలను అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినప్పుడల్లా నిధులు తీసుకొస్తూనే ఉంటా.
గంజాయి, డ్రగ్స్, మందు బాట పట్టిన యువతను క్రీడలవైపు దారి మళ్లిస్తున్నాం. ఆదాయం పెంచాలి. పేదవాడికి పంచాలి అనేదే మా లక్ష్యం. కొంతమందికి మా అభివృద్ధి నచ్చడం లేదు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులు మేము చేస్తున్నాం. పిప్రి వేదికగా చెబుతున్నా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 2034 వరకు ప్రజా పాలన కొనసాగుతుంది. మా హయాంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా మారుతుంది. పదేళ్లలో చేసిన 8 లక్షల కోట్ల అప్పుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడేస్తుంటే విపక్షాలు సహకరించాలి కదా? అసెంబ్లీలో మాట్లాడదాం రండి అంటే రారు. బయట ప్రజలను మాత్రం మభ్య పెడతారు. నిర్బంధాల నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. తెలంగాణలో మళ్ళీ గడీల పాలన రానివ్వం. 2034 వరకు మా ప్రభుత్వం కొనసాగుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు
