CM Revanth Reddy : సోనియాగాంధీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్.

CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 100 రోజుల పాలన, గ్యారంటీల అమలుపై రేవంత్ వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, నేతల చేరికలపైనా సోనియాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు సమాచారం. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాలపై అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చలు జరుపుతున్నారు.

రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీఈసీ సమావేశాల్లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. మొదటి లిస్టులో మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.

లోక్ సభ అభ్యర్థుల ఎంపికపైన రేపు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. అలాగే మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ కు సంబంధించిన ఫైనలైజేషన్ పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రెండు సమావేశాల్లోనూ రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకు 4 లోక్ సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇంకా 13 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ సహా పెద్దపల్లి, భువనగిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్, నిజామాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా పెండింగ్ లో ఉంది.

వీటికి సంబంధించి ఆశాశహులు ఎవరెవరు ఉన్నారు? అక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఇటువంటి అన్ని అంశాలపై కూడా సోనియా, రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ చర్చిస్తున్నట్లు సమాచారం. వీటికి తోడు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశంపైనా డిస్కస్ చేయనున్నారు రేవంత్. ఇక, లోక్ సభ ఎన్నికలకు సోనియా, రాహుల్ గాంధీలు ప్రచారానికి రావాలని సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు.

Also Read : ఖమ్మం పార్లమెంట్ బరిలో టీడీపీ? ససేమీరా అంటున్న బీజేపీ సీనియర్లు!

 

 

ట్రెండింగ్ వార్తలు