CM Revanth Reddy : నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో కొత్త పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
- Harish Thanniru
- Published on- October 21, 2026 / 01:18 PM IST
CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణలో కొత్త పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గోషామహల్ పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమరువీరుల స్థూపం వద్ద డీజీపీ సీవీ ఆనంద్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సీఎం అన్నారు.
Also Read : Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీపై కీలక విషయాలను వెల్లడించారు. పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. 4,773 కానిస్టేబుల్ సహా మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని చెప్పారు. 2028 నాటికి పోలీస్ శాఖలో అన్ని ఖాళీలను విడుతల వారిగా భర్తీ చేస్తామని చెప్పారు. 112 మంది డీఎస్పీలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేశాం. ఈ శాఖలో ఎక్స్ గ్రేషియాను హోదాను బట్టి రూ.కోటికి పైగా పెంచామని తెలిపారు.
అమరులైన వారి కుటుంబాలు ఒంటరి కావని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని.. వారి భవిష్యత్తు అవసరాల కోసం బాధ్యతగా పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారి పిల్లల చదువులకు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
