Rythu bharosa : రైతు భరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. కేవలం ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే నిధులు.. ఇతర పంటలకూ బోనస్..!

Rythu bharosa : రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఇవాళ సాయంత్రం 4గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు.

Rythu bharosa

  • ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల
  • రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు జమ
  • ఇతర పంటలకుసైతం బోనస్!

Rythu bharosa : తెలంగాణలోని రైతులకు శుభవార్త. నేడు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. అంతేకాక.. నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి ఇతర పంటలకు బోనస్ ప్రకటించే అవకాశం ఉంది.

Also Read : Gold Rate Today : భారీగా పతనమైన బంగారం ధర.. మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా? కారణాలివే.. నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఇలా..

రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఇవాళ సాయంత్రం 4గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి సోమవారం నిధులు జమ కానున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా 73లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా పథకం కింద 1.50కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.9వేల కోట్లను సమకూర్చుకుంది. అయితే, రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32లక్షల మందికి ఎకరం వరకు, 48.68లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి. తొలి విడతలో ఎకరం భూమి కలిగిన 24.32లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లను ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి సోమవారం రైతుల బ్యాంక్ ఖాతాలకు చేరుతాయి.

తొలి విడతలో రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయనుండగా.. ఇరవై రోజుల తరువాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడతలో రూ.2,760 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మరోవైపు.. నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి ఇతర పంటలకు బోనస్ ప్రకటించే అవకాశం ఉంది.

పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్రంలో కొరత, డిమాండ్ ఉన్న పంటలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నర్మెటలో జరిగే రైతు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి కొత్త పంటలకు బోనస్ పై విధాన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ప్రతియేటా రెండు సీజన్లలో 30 రకాల పంటలను 2.14 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రెండేళ్లుగా సన్నవడ్లకు ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.500 చోప్పున బోనస్ ఇస్తోంది. అయితే, ఇక నుంచి ఆయిల్ ఫామ్ తోపాటు ఇతర నూనె గింజలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు పంటలకు సైతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఈమేరకు దృష్టి సారించింది. అందులో భాగంగానే 2026-27 బడ్జెట్ లో పంటల బోనస్ కు మొత్తంగా రూ.3,500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.