CM Revanth Reddy : నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
- Harish Thanniru
- Published on- August 16, 2026 / 07:54 AM IST
CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత కామారెడ్డి జిల్లాకు వెళ్లనున్న సీఎం.. ఆ తరువాత ములుగు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తరువాత హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు.
Also Read : Telangana Govt : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టీజీపీఎస్‌సీ కీలక ప్రకటన .. వరుస నోటిఫికేషన్లు
మూడు జిల్లాల పర్యటనలో భాగంగా ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్‌పల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ సమ్మక్క – సారలమ్మలను దర్శించుకుంటారు. అనంతరం చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి 2.20 గంటలకు ములుగు చేరుకుంటారు. గట్టమ్మ దేవాలయం సమీపంలో హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం 2.40 గంటలకు నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించి.. ఇదే ప్రాంగణంలో ములుగు జిల్లాలో రూ.868 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ వేదిక నుంచి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 3గంటలకు ములుగు జిల్లా నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి హనుమకొండ జిల్లా పరకాలకు చేరుకుంటారు. పరకాల నియోజకవర్గంలో రూ. 443.42 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ములుగు, హన్మకొండ జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ములుగు, మేడారంలో మంత్రి సీతక్క పరిశీలించారు. అదేవిధంగా ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన హ్యామ్ రోడ్ల పైలాన్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
హ్యామ్ విధానంలో మూడు దశల్లో 18,472 కిలోమీటర్ల మేర రహదారులను ప్రభుత్వం నిర్మించనుంది. తొలిదశ మొత్తం 7,448 కిలోమీటర్ల మేర 2,145 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 176 గ్రామ పంచాయతీలకు మొదటిసారిగా 934 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తారు. ఇప్పటికే ఉన్న బీటీ రోడ్లలో 5,490 కిలోమీటర్ల మేర బలోపేతం, మరమ్మతులు చేపట్టి ఆధునికీకరిస్తారు. అధిక రద్దీ ఉన్న 1,024 కిలోమీటర్లు సింగిల్ లేన్ బీటీ రోడ్లను ఇంటర్మీడియట్ లేన్ లుగా విస్తరించనున్నారు. ఈ పనులతో తొలిదశలో మొత్తం 3,036 గ్రామ పంచాయతీలు లబ్ధిపొందనున్నాయి.
