New Ration Cards : తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభానికి డేట్ వచ్చేసింది.. ఆ రోజు నుంచే..
New Ration Cards Distribution In Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
- Harish Thanniru
- Updated on- August 6, 2026 / 11:38 AM IST
CM Revanth Reddy New Ration Cards Distribution August 15
New Ration Cards Distribution In Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీన తెలంగాణలో నూతన పీడీఎస్ (PDS) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఆ తరువాత రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
Also Read : Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
కొత్త రేషన్ కార్డుల పంపిణీ తేదీ ఫిక్స్ కావడంతో అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా తుది లబ్ధిదారుల జాబితాల ధృవీకరణను (e-KYC) త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డుల ముద్రణ స్థాయి నుంచి జిల్లాలకు చేరే వరకు సురక్షితమైన రవాణా నిర్వహణపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని కొత్త రేషన్ కార్డుల పంపిణీని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విడతలో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.05కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ (పీవీసీ) రూపంలో రూపొందించిన నూతన రేషన్ కార్డులను అందించనున్నారు. వాటర్ ప్రూఫ్, క్రెడిట్ కార్డు పరిమాణంలో అంత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్ తో పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపర్చారు.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట లభించినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇదిలాఉంటే. కొత్త రేషన్ కార్డుల పంపిణీ తరువాత సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
