Cold Wave Alert
Cold Waves Effect : చలి పంజా విసురుతోంది.. పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉండటంతో ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే 25 జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆయా జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు టెంపరేచర్లు పడిపోయాయి. అయితే, వచ్చే మూడ్రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కంటే ఐదు డిగ్రీలు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తీవ్రమైన చలితో తెలంగాణ ప్రజలు గజగజా వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి మెజార్టీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ప్రజలు చలి తీవ్రతకు తాలలేకపోతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు 20 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 10 నుంచి 13 తేదీల మధ్య మరింత తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 శాతం నుంచి 7శాతం వరకు తగ్గుతాయని అంచనా వేసింది. హైదరాబాద్ తో సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి 4శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వాతావరణ శాఖ వివరాలు ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 6.1డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అక్కడ నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లాలో 6.3, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 6.9డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడ్రోజులు చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, ఈనెల 16వ తేదీ వరకు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 9 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.