ఆపరేషన్ కృష్ణార్జున.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన ఆపరేషన్

అవకాశం చిక్కిన ప్రతి సమయంలోనూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. దీంతో ఇద్దరు..

తెలంగాణ రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునులు కేటీఆర్, హరీశ్‌రావు… ఈ ఇద్దరు బావా బామ్మార్దులు అధికార కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయినప్పటికీ.. తమ బాస్‌ను మించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ప్రతి సందర్భంలోనూ అధికార పక్షాన్ని కార్నర్ చేస్తున్నారు బావబామ్మర్దులు. దీంతో ఈ ఇద్దరి కట్టడే ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. కేటీఆర్, హరీశ్‌రావును ఆపితే చాలు… కాంగ్రెస్‌ పార్టీకి ఎదురే ఉండదని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

అందుకే ఆపరేషన్ కృష్ణార్జునకు తెరతీశారట…. బీఆర్ఎస్‌లో మిగిలిన నేతలను పక్కనపెట్టి కేటీఆర్, హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లడమే సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. వారిద్దరినీ టార్గెట్ చేయాలని కేడర్‌కు సందేశం పంపారట ప్రభుత్వ పెద్దలు. అందుకే రెండు రోజులుగా హరీశ్‌రావు, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ నిరసనలు ఉధృత మయ్యాయంటున్నారు.

ఆపరేషన్ కృష్ణార్జున…. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన ఆపరేషన్ ఇది. ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్న విపక్ష నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ను టార్గెట్ చేయడటమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. గత 8 నెలలుగా ప్రభుత్వంపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఈ ఇద్దరు బావా బామ్మార్దులు…. సీఎం రేవంత్‌రెడ్డికి చికాకుగా తయారయ్యారంటున్నారు.

ఆ ఇద్దరిని ఆపేదెలా?
అసెంబ్లీలోనూ బయటా ఒకరి తర్వాత ఒకరు గుక్క తిప్పకుండా విమర్శలు గుప్పిస్తుండటంతో ఆ ఇద్దరిని ఆపేదెలా? అని ఆలోచించిన ప్రభుత్వం పకడ్బందీ వ్యూహరచన చేసిందంటున్నారు. ఏ చిన్న అవకాశం లభించినా… హరీశ్‌రావు, కేటీఆర్‌ను వదలొద్దని కేడర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంటున్నారు.

రుణమాఫీ అంశంపై హరీశ్‌రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళనలు చేయడం… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం వెనుక ఆపరేషన్ కృష్ణార్జున వ్యూహమే ఉందంటున్నారు. 8 నెలల కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఎంతలా కష్టపడినా, అందరికీ రుణమాఫీ జరగలేదని హరీశ్‌రావు నానాయాగీ చేస్తున్నారని మండిపడుతోంది కాంగ్రెస్. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు… రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని ఆరోపిస్తున్నారు.

గత ప్రభుత్వంలో తాము లక్ష మాఫీ చేస్తేనే 17 వేల కోట్లు వెచ్చిస్తే… ఇప్పుడు రెండు లక్షల మాఫీకి ఇంచుమించు అంతేమొత్తం కేటాయించడంపై అనుమానాలు లేవనెత్తుతున్నారు హరీశ్‌రావు. దీంతో హరీశ్ టార్గెట్ గా ఎదురుదాడి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రుణమాఫీ జరిగితే తాను రాజీనామా చేస్తానని గతంలో హరీశ్‌రావు చేసిన సవాల్‌ను తాజాగా తెరపైకి తెచ్చి…. ఊరూరా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రుణమాఫీ జరిగినందున హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉచిత బస్సు ప్రయాణంపై డైలాగ్ వార్
ఇక తొలి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. తాజాగా కొందరు మహిళలు బస్సులో వెల్లుల్లి వేరడం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, మరోమారు రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలోనే ఉచిత బస్సుపై విమర్శలు చేసిన కేటీఆర్… మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆక్షేపిస్తూ… సుమోటాగా నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్.

దీంతో కేటీఆర్ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహకుంటూ క్షమాపణ చెప్పేశారు. అయినా కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఊరూరా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునివ్వడం.. ఈ నెల 24న తన ముందు విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆదేశాలివ్వడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఒకే సమయంలో ఇటు హరీశ్, అటు కేటీఆర్‌ను కార్నర్ చేస్తూ రాజకీయాన్ని రక్తికట్టిస్తోంది కాంగ్రెస్.

బీఆర్ఎస్‌ బాస్ కేసీఆర్ మంచి వాగ్దాటి ఉన్న నేత. సీఎం రేవంత్‌రెడ్డికి తగ్గట్టుగా కేసీఆర్ వాగ్బాణాలు సంధించగలరు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో ఉంటుంది. ఐతే ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్… తన పాత్రను కేటీఆర్, హరీశ్‌రావుకు అప్పగించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ఇద్దరూ కృష్ణార్జుల్లా పోరాడుతున్నారు. ఇదేసమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్నా, ఈ ఇద్దరు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

అవకాశం చిక్కిన ప్రతి సమయంలోనూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. దీంతో ఇద్దరు బావా బామ్మార్దులను ఆపితే… బీఆర్ఎస్‌లో మాట్లాడేవారే ఎవరూ ఉండరని… గులాబీదళంపై పైచేయి సాధించొచ్చని భావిస్తోంది కాంగ్రెస్. అందుకు తగ్గట్టు పావులు కదుపుతుండటంతోనే ఒకే సమయంలో కేటీఆర్, హరీశ్రావుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తోందంటున్నారు. మొత్తానికి ఆపరేషన్ కృష్ణార్జునుల ఎపిసోడ్‌కు ఎలాంటి ముగింపు వస్తుందో… ఎవరు తగ్గుతారో…ఎవరు నెగ్గుతారో చూడాల్సి ఉంది.

Also Read: తెలంగాణలో పదవుల పందేరానికి మరోసారి బ్రేక్ పడిందా?

ట్రెండింగ్ వార్తలు