తెలంగాణలో పదవుల పందేరానికి మరోసారి బ్రేక్ పడిందా?

రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌డ్డి పోటీ పడుతుంటే..

తెలంగాణలో పదవుల పందేరానికి మరోసారి బ్రేక్ పడిందా?

CM Revanth Reddy

తెలంగాణలో పదవుల పందేరానికి మరోసారి బ్రేక్ పడిందా? కాంగ్రెస్‌లో అపరిమిత ప్రజాస్వామ్యమే పదవుల భర్తీకి అడ్డుగా మారిందా? సీనియర్ల పంతంతో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ నియామకంపై అధిష్టానం అడుగు ముందుకు వేయలేకపోతోందా? సీఎం రేవంత్‌రెడ్డి తాజా పర్యటన తర్వాతైనా పరిస్థితిలో మార్పురాలేదా? సీనియర్లు పట్టువీడకపోవడం వల్ల ఆశావహులు మరికొన్నాళ్లు నిరీక్షించాల్సిందేనా? తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో తాజా అప్డేట్స్ ఏంటి?

మంత్రి, పీసీసీ చీఫ్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు మరికొన్నాళ్లు వేచిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో పదవుల భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఒక్క అడుగూ ముందుకు పడలేదని సమాచారం. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నా పార్టీలో ఏకాభిప్రాయం కుదరక మళ్లీ మళ్లీ వాయిదా పడుతోంది.

తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ సారి ఎలాగైనా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తేవాలని ప్రయత్నిస్తున్నా, సీనియర్ల మోకాలడ్డుతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. జూన్ 27తో పీసీసీ చీఫ్ పదవీకాలం ముగియడంతో కొత్త వారిని నియమించాలని భావించింది కాంగ్రెస్ అధిష్టానం. రకరకాల సమీకరణలపై సీనియర్లతో చర్చించింది.

ఎప్పటికప్పుడు వాయిదా
ఐతే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు నేతలతో అధిష్టానం రెండుసార్లు చర్చించింది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్లు పరిశీలనకు వచ్చినా, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎంపీగా బలరాం నాయక్, ఎమ్మెల్సీగా మహేశ్ కుమార్ గౌడ్ ఉండటంతో మధుయాష్కీ వైపే కొంత మొగ్గు ఉన్నప్పటికీ లైన్ మాత్రం క్లియర్ అవ్వడం లేదంటున్నారు.

ఇక మంత్రివర్గ విస్తరణలో తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోవాలని సీనియర్లు ప్రయత్నస్తుండటంతో ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఇటు మంత్రివర్గం, అటు పీసీసీ చీఫ్ నియామకంలో ఒకదానికొకటి లింకు పెట్టడంతో పదవుల భర్తీ నాన్‌స్టాప్ సీరియల్‌గా మారిపోయింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా, దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్ రావు, వివేక్ పోటీ పడుతున్నారు.

వీరిలో ప్రేమ్‌సాగర్‌రావు పేరును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బలంగా సమర్థిస్తుంటే… వివేక్ వైపు సీయం రేవంత్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అటు వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ కూడా తనవంతు ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. దీంతో ఆ జిల్లాలో ఎవరికి చోటు ఇవ్వాలనేది తేల్చుకోలేకపోతున్నారంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, మదన్మోహనరావు మధ్య పోటీ కనిపిస్తోంది. ఇద్దరూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారంటున్నారు. సుదర్శన్ రెడ్డి వైపు రేవంత్ మొగ్గు చూపుతుంటే…ఇతర సీనియర్ల సహకారం, ఢీల్లీ లాబీయింగ్ చేస్తున్నారట మదన్ మోహన్.

ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌డ్డి పోటీ పడుతుంటే… హైదరాబాద్ కోటాపై దానం నాగేందర్ ఆశలు పెట్టుకున్నారు. ఇక మంత్రివర్గంలో బెర్తు కోసం తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతుండగా, అదే జిల్లా నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

పరిశీలనలో మరింత మంది పేర్లు
మున్నూరు కాపు వర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ … ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. బీసీ రజక కోటాలో రేవంత్ కు సన్నిహితుడైన వీర్లపల్లి శంకర్ తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బి.ఆర్.ఎస్ ను ఎదుర్కొవాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని మైనంపల్లి రోహిత్ కోరుతుండగా…. అక్కడ హరీశ్‌, రఘునందన్ లాంటి వారికి చెక్ పెట్టేందుకు రోహిత్ సరైనోడేనని భావనలో సీఎం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మంత్రివర్గంలో తనకు అనుకూలమైన వ్యక్తులను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. చాపకింద నీరులా సీనియర్ నేతలు తమ సన్నిహితులకు బెర్త్ కోసం పట్టుబడుతున్నారని చెబుతున్నారు. దీంతో మంత్రివర్గం విషయంలో లెక్కలు ఏమాత్రం సరితూగడం లేదని సమాచారం. మంత్రివర్గ లెక్కలు కుదిరితే.. పీసీసీ అంశాన్ని తేల్చవచ్చని భావిస్తోన్న అధిష్ఠానం రెండింటినీ వాయిదా వేసినట్లు చెబుతున్నారు.

దీంతో ముచ్చటగా మూడోసారి కూడా పీసీసీ, మంత్రివర్గ విస్తరణ అంశం వాయిదా పడినట్లేనంటున్నారు. ఇక రాష్ట్రంలో అగ్రనేతలు పర్యటన ఉన్నందున ఈ నెలలో పదవుల భర్తీ ఉండదని, రాజ్యసభ ఎన్నికల తర్వాత సెప్టెంబర్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా సీనియర్ల పంచాయతీ మరోసారి ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లేసింది.

ఆసుపత్రులు శుభ్రంగా ఉండాలి.. రోగులు ఆసుపత్రికి రాగానే మంచి వాతావరణం కనిపించాలి: మంత్రి సత్యకుమార్