తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా…334కు పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు తన ప్రతాపం చూపుతోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.

  • Publish Date - April 6, 2020 / 12:44 AM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు తన ప్రతాపం చూపుతోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.

తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు తన ప్రతాపం చూపుతోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో 62 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల 334కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  శనివారం వరకు తెలంగాణలో 272 కేసులు నమోదుకాగా… ఆదివారం ఆ సంఖ్య మరింత పెరిగింది. మర్కజ్‌ లింకుతో తెలంగాణలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో నిన్న 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 62 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 334కు పెరిగింది.(ఒక్క విందు ఎంత పని చేసింది…26 వేల మంది క్వారంటైన్)

కరోనాతో 11 మంది మృతి
తెలంగాణలో ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 11 మంది చనిపోయారు. మరో 33 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వారిని డిశ్చార్జి చేశారు.  ప్రస్తుతం తెలంగాణలో 283 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇవాళ మరో 600 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశముంది.

హైదరాబాద్‌లో 162 మందికి పాజిటివ్‌ 
ప్రస్తుతం తెలంగాణలోని 283 యాక్టివ్‌ కేసుల్లో…. హైదరాబాద్ బాధితులే ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి 162 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒకరోజు వ్యవధిలోనే 51 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. 11 మంది డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్‌ తర్వాత ప్లేస్‌లో వరంగల్‌ అర్బన్‌ నిలిచింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఇప్పటి వరకు 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్‌లో 19 మంది, నల్లగొండలో 13మంది, మేడ్చల్‌లో 12మంది, రంగారెడ్డిలో 11మంది, ఆదిలాబాద్‌లో 10మంది కరోనా బారిన పడ్డారు.
 
కరోనా బాధితులకు చికిత్స
కామారెడ్డిలో 8మంది, సంగారెడ్డిలో ఏడుగురు, కరీంనగర్‌లో ఆరుగురు కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్‌ 10, భద్రాద్రి 3, జగిత్యాల 02, జనగామ 2, జయశంకర్‌ భూపాలపల్లి 1, జోగులాంబ గద్వాల 5, మహబూబ్‌నగర్‌ 01, నాగర్‌కర్నూలు 2, నిర్మల్‌ 1, నిజామాబాద్‌ 19, పెద్దపల్లి 1, సంగారెడ్డి 7, సిద్దిపేట1, సూర్యాపేట2, వికారాబాద్‌ 4, ములుగు 2 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

నాలుగు రోజుల వ్యవధిలోనే 190 కేసులు 
తెలంగాణలో గత నాలుగు రోజుల వ్యవధిలోనే 190 కేసులు నమోదయ్యాయి. మార్చి 31న 15 కేసులు, ఏప్రిల్‌ 1 నుంచి వరుసగా భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో ఏకంగా ఒకేరోజు 75 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా మర్కజ్‌తో సంబంధముండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  మార్చి 26 నుంచి రాష్ట్రంలో ఢిల్లీతో కనెక్ట్‌ అయిన కరోనా కేసులు బయటపడుతూ వస్తున్నాయి. దేశమంతా లాక్‌డౌన్‌ విధించే సమయానికి తెలంగాణలో ఐదారు జిల్లాల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

అన్ని జిల్లాల్లో కేసులు నమోదు
గత ఐదారు రోజులుగా వరుసగా దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. మున్ముందు మిగిలిన జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులన్నీ కూడా మర్కజ్‌తో సంబంధమున్నవేనని తేలింది. పైగా అక్కడికి వెళ్లి వచ్చిన వారి కుటుంబాలకే కాకుండా ఇతరులకు కూడా ఇది సోకుతోంది. దాంతో కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది.