తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కామారెడ్డిలో కరోనా కలకలం రేగింది. రామారెడ్డి మండలంలో ఆర్మీ జవాన్ లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అధికారులు జవాన్ ని హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు. జవాను మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్ నుంచి వచ్చాడు. రైలులో కామారెడ్డి వచ్చాడు. జవాన్ తో పాటు రైలులో ప్రయాణించిన 8మందికి కరోనా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు:
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా కట్టడికి కేసీఆర్ సర్కార్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడం, హైదరాబాద్ లో ఆంక్షలు మరింత కఠినతరం చేయడం, ఆర్టీసీ బస్సు సర్వీసులను పరిమితం చేయడం, హోటల్స్ మూసివేత వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో S-9 బోగిలో రామగుండం వచ్చిన ఇండోనేషియన్లు:
ఒక్కసారిగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో కరీంనగర్ భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన ఇస్లామిక్ మత ప్రచారకుల బృందం ఈ మహమ్మారిని కరీంనగర్‌కు తీసుకొచ్చింది. మార్చి 13న ఢిల్లీ నుంచి బయలుదేరిన 10మంది సభ్యుల బృందం 14న ఉదయం రామగుండం చేరుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ఎస్-9 బోగీలో వారంతా వచ్చారు. ఆ తర్వాత రోజు ఓ ప్రైవేట్ వాహనంలో ఇండోనేషియన్లు కరీంనగర్‌కు వచ్చారు. ఆ బృందంలోని ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. దీంతో కరీంనగర్‌లో టెన్షన్ నెలకొంది. వైరస్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. కరీంనగర్‌లో ఆంక్షలు విధించింది. ఇండోనేషియా బృందం కలెక్టరేట్‌కు సమీపంలోనే బస చేసింది. దీంతో కలెక్టరేట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. నగరంలో దుకాణాలు తెరుచుకోలేదు. పదో తరగతి పిల్లలు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నారు.
కరోనా సోకిన ఇండోనేషియన్లతో సన్నిహితంగా ఉన్న 8మంది గురించి ఆరా:
ఇండోనేషియా బృందం ఎవరెవరితో సన్నిహితంగా తిరిగారన్నది అధికారులు ఆరా తీస్తున్నారు. 8మంది వీరితో బాగా క్లోజ్‌గా ఉన్నట్లు గుర్తించారు. వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఆ 8మంది ఎక్కడెక్కడ, ఎవరెవరితో తిరిగారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌కు వంద ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. వారు ఇంటింటికీ తిరిగి నిర్బంధ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 బెడ్లను సిద్ధం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే.. దేశవ్యాప్తంగా 169 కరోనా కేసులు నమోదైతే తెలంగాణలోనే 13 రికార్డయ్యాయి.
See Also | ఆ విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు : ఆర్టీసీ బస్సుల్లో ఇళ్లకు చేరుస్తాం – ఆదిమూలపు సురేష్