లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్…పెరుగుతున్న కేసులు 

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.

  • Publish Date - April 15, 2020 / 11:23 AM IST

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇందుకు కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్టు కావడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో అలాంటి వ్యక్తులపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టారు. తాజాగా లక్షణాలు లేని 900 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. లక్షణాలు లేకుండానే కొంతమందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. 

వరంగల్ నుంచి పలువురు వ్యక్తులు ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చారు. వారిలో చాలా మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే వారితో కాంటాక్ట్ అయిన ఓ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు బయటకి కనిపించలేదు. కాంటాక్ట్ లిస్టులో ఉన్నందున అనుమానంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

సూర్యపేటలో 20 మందికిపైగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. మర్కజ్ తో కాంటాక్ట్ కలిగిన ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవు. కానీ మర్కజ్ కు వెళ్లిన వ్యక్తితో కాంటాక్ట్ అయ్యారన్న కారణంతో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. 

ఈ విధంగా రాష్ర్టంలో కరోనా సోకిన వ్యక్తులతో కాంటాక్ట్  అయిన వారిలో కొందరికి లక్షణాలు లేనప్పటికీ వారికి పాజిటివ్ రావడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు విదేశీ ప్రయాణ చరిత్ర, మర్కజ్ వ్యవహారంతో సంబంధం ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పరీక్షలు నిర్వహించారు. వారిలో కొంతమందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. 

అలాగే వారితో కాంటాక్ట్ లో ఉన్నవారిని క్వారంటైన్ లో ఉంచి, కరోనా అనుమానిత లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహించారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు, వారి కాంటాక్టుల్లో లక్షణాలు ఉన్న వారితో పాటు, కాంటాక్టుల్లో ఎలాంటి అనుమానిత లక్షణాలు లేని వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

వైరస్ వ్యాప్తి తొలుత ఉన్నట్లు కాకుండా దాని స్వరూపం మార్చుకుంటుందన్న చర్చ జరుగుతుంది. పాజిటివ్ వున్న వ్యక్తులతో ఏ విధంగానైనా కాంటాక్టు ఉంటే లక్షణాలు బయటకు కనిపించక పోయినప్పటికి కరోనా వైరస్ సోకే ప్రమాదం  ఉందని వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

విదేశీ ప్రయాణ చరిత్ర కలిగి ఉన్న వారిలో లక్షణాలు ఉన్న వారిని, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇప్పటి వరకు పరీక్షించారు. వారి కాంటాక్టులను క్వారంటైన్ లో ఉంచారు. వారిలో లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. వారిలో కొంత మందికి పాజిటివ్ రాగా, చాలా మందికి నెగిటివ్ వచ్చింది.  

ఎలాంటి వైరస్ లక్షణాలు లేని 25 వేల మందికి హోం క్వారంటైన్ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మర్కజ్ వెళ్లి వచ్చిన 1,291 మందిని గుర్తించారు. వారిలో చాలా మందిని, వారితో కాంటాక్టు ఉన్న వారిని క్వారంటైన్ లో ఉంచి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో చాలా మందికి పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారించారు. 

మర్కజ్ తో కాంటాక్టు ఉండి, వైరస్ లక్షణాలు లేని వారిలో చాలా మందిని హోం క్వారంటైన్ కు పంపించారు. అయితే, ఇప్పుడు కాంటాక్ట్ ల జాబితా పెరుగుతోంది.  వారెక్కడికి వెళ్లారని, ఎంత మందిని కలిశారని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతర కాంటాక్టుల్లో ఎలాంటి లక్షణాలు లేనప్పటికి కొంత మందికి పాజిటివ్ వస్తుండటంతో అధికారులు తమ వ్యూహాన్ని మారుస్తున్నారు. క్వారంటైన్ ఉన్న వారందరినీ, మర్కజ్ కాంటాక్టుల్లో ఉన్న వారందరినీ పరీక్షించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాంటాక్ట్ అయిన వారిలో ఎలాంటి లక్షణాలు లేని 900 మందికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన సంగతి తెలిసిన విషయమే. సోమవారం (ఎప్రిల్ 13, 2020) నాటికి కంటైన్మెంట్ ప్రాంతాల్లో 27.32 లక్షల మందిని సర్వే చేసారు. వారిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నాయా మర్కజ్ కి వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్టును ట్రేస్ చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కాంటాక్టుల జాబితా కూడా పెరుగుతుంది. 

కానీ ఎలాంటి వైరస్ లక్షణాలు లేనివారికి కూడా పరీక్షలు చేయాల్సి రావడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి మర్కజ్ కి వెళ్లొచ్చిన వారు, వారి కాంటాక్టుల వరకే పరిమితమై లక్షణాలు ఉన్న వారికే పాజిటివ్ వచ్చేటట్లు అయితే కరోణా వ్యవహారం కొలిక్కి వచ్చేది. 

కాంటాక్టులకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ వస్తున్నట్లైతే ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇలా అయితే కూరగాయలు కొనేవారు మొదలు పాలు అమ్మే వ్యక్తికి వరకు కూడా ఎవరినీ నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని వైద్య నిపుణుడు తెలిపారు. మర్కజ్ వ్యవహారంలో  లక్షణాలు లేని కాంటాక్టు వ్యక్తులకు కొంతమందికి పాజిటివ్ వస్తుండటంతో మరి విదేశాల నుంచి వచ్చిన కాంటాక్టుల్లో లక్షణాలు లేని వారిలో ఎవరికైనా పాజిటివ్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయా అన్న కోణంపై వైద్యాధికారుల్లో చర్చ సాగుతోంది.