Covid 19 Cases
Covid-19 Tension In Schools, Hostels: తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జెడ్పీహై స్కూల్ లో కరోనా కలకలం రేపింది. 8మంది టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్న ఒక టీచర్ కు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో, స్కూల్ లోని టీచర్లు, సిబ్బంది, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. అందులో తాజాగా ఏడుగురు టీచర్లకు పాజిటివ్ అని తేలింది. దీంతో స్కూల్ కు 5 రోజులు పాటు అధికారులు సెలవులు ప్రకటించారు.
విద్యార్థులపై కరోనా ప్రతాపం:
తెలంగాణలో నిన్న ఒక్కరోజే 86మంది విద్యార్థులకు కరోనా సోకింది. నిర్మల్ జిల్లా భైంసా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 25మందికి, హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్టీ హాస్టల్ లో 22మందికి, కామారెడ్డి జ్యోతి బాపూలే విద్యాలయంలో 13మందికి, బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురికి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్టీ బాలికల హాస్టల్ లో 10మందికి, వివిధ విద్యా సంస్థల్లో మరో 13మంది విద్యార్థులకు కరోనా సోకింది. టీచర్లూ పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు.
స్కూళ్లు, హాస్టల్స్ లో కరోనా ప్రబలుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గురువారం(మార్చి 18,2021) నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని రెండు పాఠశాలలు, రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహంలోని 335 మందికి నిర్వహించిన పరీక్షల్లో 30 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 28 మంది విద్యార్థులు, హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్, ఉపాధ్యాయుడు ఉన్నారు.
* రాజేంద్రనగర్‌లోని ఎస్టీ బాలుర వసతి గృహంలోని పలువురు విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. 105లో 22 మంది విద్యార్థులు, వార్డెన్, వాచ్‌మెన్ సహా 24 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతుండటంతో అక్కడా పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది.
* శంషాబాద్ చిన్న గోల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 48 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.
* సరూర్ నగర్‌లోని (ముషీరాబాద్) జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలోని 30 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది.
* అబ్దుల్లాపూర్‌మెట్ బాటసింగారం జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో వంద మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ తేలింది.
* బండ్లగూడ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 38 మందికి కొవిడ్ సోకిన విషయం తెలిసిందే. నిర్ధారణకు వీరికి మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా వైరస్ ఉన్నట్లు తేలింది.
* ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులు వింటారని తల్లిదండ్రులు విద్యార్థులను తీసుకెళ్తున్నారు. ఫలితంగా హాస్టల్స్ ఖాళీ అవుతున్నాయి.
తెలంగాణలో కరోనా విజృంభణ:
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 300 దాటింది. నిన్న(మార్చి 18,2021) రాత్రి 8గంటల వరకు 62వేల 972 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో మరో ఇద్దరు మరణించారు. కరోనా బారి నుంచి 142 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2వేల 434 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 943 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(మార్చి 19,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది.