Crime news
Crime News : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. డైరీ ఫామ్‌లో పనిచేసేందుకు బీహార్ నుంచి ఓ జంట వచ్చింది. అయితే, కొద్దిరోజులకే మహిళ.. తన భర్తను హత్యచేసి మరో వ్యక్తితో పారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మూడో వ్యక్తి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. (Crime news)
అజీజ్ నగర్‌కు చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి రెండు నెలల క్రితం డెయిరీ ఫామ్‌ను ప్రారంభించాడు. అందులో పనిచేసేందుకు మనుషులు కావాలని బీహార్‌కు చెందిన ఏజెంట్ పవన్‌ను సంప్రదించాడు. అతని ద్వారా దాదాపు నెల రోజుల క్రితం పూనమ్, రాకేశ్ కుమార్ దంపతులు ఫామ్ హౌస్‌లో పనిచేసేందుకు వచ్చారు. అప్పటినుంచి ఫాంహౌస్‌లో కూలీలుగా వారు పనిచేస్తున్నారు.
ఆగస్టు 21న రాజిరెడ్డి డైరీ ఫామ్ వద్దకురాగా.. రాకేశ్ దంపతులతో పాటు మరో కొత్త వ్యక్తి కనిపించాడు. అతను ఎవరు..? అంటూ రాజిరెడ్డి వారిని ప్రశ్నించగా.. తమ బంధువు అని చెప్పడంతో రాజిరెడ్డి సరేనని వెళ్లి పోయాడు. మరుసటిరోజు రాజిరెడ్డి డైరీ ఫామ్ వద్దకు వచ్చాడు. అయితే, రాకేశ్ కనిపించక పోవడంతో ఎక్కడికి వెళ్లాడని అతని భార్య పూనమ్‌ను ప్రశ్నించాడు. మద్యం తాగొచ్చి తనతో గొడవపడి ఎక్కడికో వెళ్లిపోయాడని ఆమె బుకాయించింది.
మరుసటిరోజు ఫామ్ వద్దకు రాజిరెడ్డి వచ్చి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. వెంటనే రాకేశ్‌కు ఫోన్ చేయగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఏజెంట్‌కు ఫోన్ చేసిన రాజిరెడ్డి.. రాకేశ్, అతని భార్య కనిపించడం లేదని చెప్పాడు.
కొద్దిసేపటి తరువాత ఏజెంట్ పవన్ డైరీ ఫామ్ యాజమాని రాజిరెడ్డికి ఫోన్ చేసి.. రాకేశ్ కుమార్‌ను పూనమ్, మహేశ్‌లు హత్యచేసి పారిపోయారు.. అతని మృతదేహాన్ని బావివద్ద పడేశారని చెప్పాడు. వెంటనే రాజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత బావి వద్దకు వెళ్లి చూస్తే రాకేశ్ కుమార్ మృతదేహం కనిపించింది. పోలీసులు వచ్చి రాకేశ్ కుమార్ తలపై రాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నారు. అయితే, రాకేశ్ దంపతులతో కనిపించిన ఆ మూడో వ్యక్తి ఎవరు..? హత్యతో అతనికి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడో వ్యక్తి పూనమ్ ప్రియుడా..? ముందస్తు ప్రణాళికలో భాగంగానే రాకేశ్ ను వారు హత్యచేసి పారిపోయారా..? అసలేం జరిగిందనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.