ఆదర్శ పంచాయితీ : మా ఊళ్లో మద్యం తాగం అంటూ తీర్మానం..

  • Publish Date - September 24, 2020 / 11:26 AM IST

పచ్చని కాపురాలను కూల్చేసే మద్యానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది ఓ గ్రామం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు గ్రామస్తులు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం చేయాలని నిర్ణయించింది. ఆదర్శగ్రామంగా పేరు తెచ్చుకుంది. ఆ ఆదర్శ గ్రామం పేరు ‘దస్నాపూర్’.


ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామానికి చెందిన ప్రజలు, మహిళలు గ్రామంలో మద్యపానాన్ని నిషేధించారు. ఇకనుంచి గ్రామస్తులెవ్వరూ మద్యం తాగకూడదని ఒట్టు పెట్టుకున్నారు. గ్రామంలోని ప్రజలు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన తీర్మానం కాపీని ఇంద్రవెల్లి ఎస్సై నాగ్‌నాథ్‌కి అందజేశారు. మండల పరిషత్ అధ్యక్షురాలు పోటే శోభ, ఇంద్రవెల్లి ఎస్సై నాగ్‌నాథ్‌ల సమక్షంలో తీర్మానించుకుని గ్రామస్తులంతా ఈ కార్యక్రమానికి హజరైన గ్రామస్తులు మద్యాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు.


గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా దస్నాపూర్ గ్రామంలోని ఓ మహిళ మాట్లాడుతూ..‘చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మా కుటుంబాలను, గ్రామాన్ని అభివృద్ది చేసుకునేందుకు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాం’ అని తెలిపింది.


మద్యమే కాదు..గుడుంబా, పేకాట, గుట్కాలని నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని తెలిపిందామె. దస్నాపూర్ గ్రామస్తులను పెద్దలు ప్రశంసించారు. గ్రామ అభివృద్దికి తమ వంతు సహాకారం అందిస్తామని పెద్దలు అధికారులు హామీ ఇచ్చారు. దస్నాపూర్ గ్రామం మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.