Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. సీఎం రేవంత్ ఇంట్లో కీలక సమావేశం..
టికెట్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ లో అభివృద్ధి పనులు, అభ్యర్థి ఎంపికపై మంత్రులతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ను టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీఎం రేవంత్ కు అందించారు. ఈ నెలాఖరున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. టికెట్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ప్రధానంగా అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా నవీన్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వే నిర్వహించింది.
ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేదానిపై సీఎం రేవంత్ ఆరా తీసినట్లు సమాచారం. అటు ఈ నెలాఖరులోగా జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలై, వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అభ్యర్థి ఎంపిక, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.