Deet app
DEET Telangana: ప్రభుత్వ కొలువుల సంగతి అలాఉంచితే తమకు నచ్చిన ప్రైవేట్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడాల్సిన వస్తుంది. తెలిసిన వారి ద్వారా, పలు యాప్ ల ద్వారా ఉద్యోగ వివరాలు తెలుసుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు, విద్యార్థుల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. వారు ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా పట్టణాలకు వచ్చి ఇక్కడే రూంలను తీసుకొని చాలీచాలని డబ్బులతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్ 4న డీట్ యాప్ ను ప్రారంభించగా.. ఇప్పటి వరకు 67 సంస్థలు, 15వేల మంది విద్యార్థులు ఇందులో రిజిస్టర్ అయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగులను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలతో లిక్ చేసేలా అధికారులు ఈ యాప్ ను అభివృద్ధి చేశారు. అంతేకాదు.. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థుల్లో అవగాహన కల్పించి వారు దీన్ని వినియోగించేలా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా డీట్ నిర్వహణ కోసం పరిశ్రమల శాఖలో ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేశారు.
ఏఏ కంపెనీలు ఉన్నాయంటే.. ..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు కచ్చితంగా 20 నుంచి 30శాతం వరకు రిక్రూట్ మెంట్లను డీట్ ద్వారా చేయాలని ప్రభుత్వం షరతు విధించింది. ఈ యాప్ లో ఆటో మొబైల్స్ , ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఔట్ సోర్సింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ రంగాలకు చెందిన సంస్థలు నమోదు చేసుకున్నాయి. అదేవిధంగా 520 లెక్చరర్, టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ఈ యాప్ ద్వారా ఎన్ రోల్ చేసుకుంది. డాక్టర్ రెడ్డీస్, ఫాక్స్ కాన్, బీడీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ హ్యుండయ్ తో పాటు అనేక ప్రముఖ కంపెనీలు ఈ యాప్ లో రిజిస్టర్ అయ్యాయి.
Also Read: హైన్‌కెన్ సిఈవోతో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ.. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు..!
ఎలా రిజిస్టర్ అవ్వాలి..
విద్యార్థులు, నిరుద్యోగులు దీనిలో రిజిస్టేషన్ అవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ ను ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలోనూ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవచ్చు. అంతేకాదు.. deet.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా రిజిస్టేషన్ చేసుకోవచ్చు. డీట్ యాప్ లో విద్యార్థులు/నిరుద్యోగులు కంపెనీలకు వేరువేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. యాప్ లో రిజిస్టర్ కావాలంటే.. డీట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత అందులో ఈ- మెయిల్ లేదా ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. వ్యక్తిగత వివరాలను, విద్యార్హతలు, వారికున్న నైపుణ్యాల వివరాలను ఎంటర్ చేయాలి. వారి వివరాల ఆధారంగా ఏఐ అల్గారిథం ద్వారా యాప్ లోనే ఆటోమేటిక్ గా ఓ రెజ్యూమె కూడా తయారవుతుంది. ఈ యాప్ లో 38వేల స్కిల్స్ ను పొందుపర్చారు. అభ్యర్థుల విద్యార్థలకు అనుగుణంగా పార్ట్ టైమ్, ఫుల్ టైమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అవకాశాలతో పాటు ఇంటర్న్ షిప్ చాన్స్ లు కూడా కల్పిస్తున్నారు. యాప్ లో ఒక్కసారి రిజిస్టర్ అయిన తరువాత తరచూ జాబ్స్ గురించి చెక్ చేసుకోవాలి. అలాకాకుండా మూడు నెలల పాటు లాగిన్ కాకుంటే సదరు అభ్యర్థిని ఇనాక్టివ్ జాబ్ సీకర్ కింద పెడతారని అధికారులు చెబుతున్నారు.
Also Read: Retirement age: ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్ పెంచడం ఖాయమా? నిరుద్యోగులకు మళ్లీ నిరాశ తప్పదా?
జాబ్ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగంకోసం పొందుపర్చిన వివరాలను ఏ రంగంలోని ఏ కంపెనీకి అనుగుణంగా ఉన్నాయో ఆ కంపెనీకి మ్యాచ్ చేసేలా ఓ ప్రత్యేకమైన ఏఐ అల్గారిథంను యాప్ లో వాడుతున్నారు. విద్యార్థుల స్కిల్స్ ఆధారంగా ఈ ఏఐ అల్గారిథం ఆయా సంస్థలకు వారి వివరాలను పంపిస్తుంది. నిరుద్యోగికి సంబంధించిన వివరాలు పలానా సంస్థకు మ్యాచ్ అయినట్లుగా ఉంటే.. సదరు నిరుద్యోగితో సంస్థ ప్రతినిధులు చాట్ బాక్స్ లో చర్చిస్తారు. ఆన్ లైన్ లోనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. కంపెనీ ఇచ్చిన ఆఫర్ ను స్వీకరించాలా లేదా అనేది పూర్తిగా అభ్యర్థి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఇచ్చిన ఆఫర్ నచ్చితే మీరు సదరు కంపెనీలో ఉద్యోగంలో చేరొచ్చు. లేదంటే రిజక్ట్ చేయొచ్చు.