Delivery Boy Jumps : హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఘోరం జరిగింది. ఓ కుక్క.. డెలివరీ బాయ్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసింది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అసలేం జరిగిందంటే..
యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్ రిజ్వాన్ (23) మూడేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6లోని లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. ఆ వెంటనే ఇంట్లో ఉన్న జర్మన్ షపర్డ్ కుక్క మొరుగుతూ మీదకి వచ్చింది.
దీంతో రిజ్వాన్ భయపడిపోయాడు. ఆ కుక్క ఎక్కడ తనపై దాడి చేస్తుందోనని కంగారుపడ్డాడు. ఈ క్రమంలో అతడు కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు, తనని తాను కాపాడుకునేందుకు మూడో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన ఆ కుక్క యజమాని వెంటనే అంబులెన్స్‌లో రిజ్వాన్ ను ఆసుపత్రికి తరలించాడు.
కాగా, ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లే రిజ్వాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కుక్క యజమానిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం డెలివరీ బాయ్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిసింది. ఆ కుక్క ఓనర్ పై స్థానికులు మండిపడుతున్నారు. అతడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోరం జరిగిపోయిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రిజ్వాన్ ను కుక్క యజమానే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.