Dog Bite Compensation : పెంపుడు కుక్క దాడిలో గాయపడిన మహిళకు రూ.2లక్షల పరిహారం.. వినియోగదారుల ఫోరమ్ సంచలన ఆదేశం

ఓ పెంపుడు కుక్క దాడిలో గాయపడిన మహిళకు రూ.2లక్షల పరిహారం ఇవ్వాలని వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పు ఇచ్చింది.

Dog Bite Compensation : పెంపుడు కుక్క దాడిలో గాయపడిన మహిళకు రూ.2లక్షల పరిహారం.. వినియోగదారుల ఫోరమ్ సంచలన ఆదేశం

Dog Bite Compensation : ఓ పెంపుడు కుక్క దాడిలో గాయపడిన మహిళకు వినియోగదారుల ఫోరమ్ లో భారీ ఊరట లభించింది. బాధితురాలకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలని వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది.

ఆగస్టు నెలలో గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళపై పెంపుడు కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ కేసులో గాయాలపాలైన మహిళకు రూ. 2 లక్షల మధ్యంతర పరిహారాన్ని ఇవ్వాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఆదేశించింది. అవసరమైతే ఈ మొత్తాన్ని కుక్క యజమాని నుంచి కూడా వసూలు చేయవచ్చని ఫోరమ్ స్పష్టం చేసింది.

న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఇంటి పనులు చేసే అత్యంత పేద మహిళగా పేర్కొన్న బాధితురాలికి మధ్యంతర ఉపశమనం కింద గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.2 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తున్నాం అని ఫోరమ్ చెప్పింది.

ఇళ్లలో పని చేసే మున్నీ అనే మహిళ.. ఆగస్టు 11న తన వదినతో కలిసి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. వినీత్ చికారా అనే వ్యక్తి పెంపుడు కుక్క దాడిలో మున్నీ తీవ్రంగా గాయపడింది. ముఖం, చేతులపై తీవ్ర గాయాలైన బాధితురాలిని తొలుత గురుగ్రామ్ సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కుక్కతో పాటు యజమాని పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. తొలుత పిట్‌బుల్‌ జాతికి చెందిన శునకంగా భావించినా.. ఇది డోగో అర్జెంటినో జాతికి చెందిన కుక్కగా యజమాని తెలిపారు.

ఈ ఘటనపై జిల్లా వినియోగదారుల ఫోరమ్ విచారణ చేపట్టి.. కుక్కను అదుపులోకి తీసుకోవాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. అలాగే, యజమాని వినీతా చికారాకు శునకాన్ని పెంచుకోవడానికి అనుమతించిన లైసెన్స్‌ను రద్దు చేసింది. దీంతో పాటు 11 విదేశీ జాతులకు చెందిన శునకాలను నిషేధించాలని, తక్షణమే అటువంటివి కస్టడీలోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాదు, 3 నెలల్లోగా పెంపుడు కుక్కలకు సంబంధించి ఓ పాలసీని తీసుకు రావాలని ఎంసీజీని ఫోరమ్ ఆదేశించింది.

ఈ కేసులో బాధితురాలి తరఫున న్యాయవాది సందీప్ సైనీ వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. తన క్లయింట్‌కు రూ.20 లక్షల పరిహారం ఇప్పించాలని ఆయన కోరారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జిందాల్.. బాధితురాలకి ఉపశమనం లభించేలా తీర్పు ఇచ్చారు.

విచారణ సందర్భంగా.. కుక్క యజమాని చట్టాన్ని ఉల్లంఘించాడని ఫోరమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధిత జాబితాలోని డోగో అర్జెంటీనో కుక్కను పెంచుకుని నిబంధనలను ఉల్లంఘించాడని మండిపడింది. కాబట్టి.. కుక్క యజమాని నుంచి రూ.2లక్షల పరిహారం వసూలు చేసుకోవచ్చని తన తీర్పులో పేర్కొంది ఫోరమ్.

అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్లు, డోగో అర్జెంటీనో, రోట్‌వీలర్, నియాపోలిటన్ మాస్టిఫ్, బోర్‌బోయెల్, ప్రెసా కానరియో, వోల్ఫ్ డాగ్, బాండోగ్, అమెరికన్ బుల్‌డాగ్, ఫిలా బ్రసిలీరో, కేన్ కోర్సో జాతుల కుక్కలను పూర్తిగా నిషేధించారు. ఈ జాతి కుక్కలను ఎవరైనా పెంచుకుంటే వెంటనే ఆ కుక్క జాతులను కస్టడీలోకి తీసుకోవాలని ఫోరమ్ ఆదేశించింది.