నేరం చేసినోళ్లని కోర్టు శిక్షించాలె కానీ.. పోలీసులు కాల్చుడేంది..

  • Publish Date - December 7, 2019 / 05:07 AM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ తరువాత నిందితు కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసింది ఆ నలుగురే అయినా..దానికి మానసికంగా శిక్ష అనుభవించేది వారి కుటుంబ సభ్యులే అనటానికి నిందితులు కుటుంబ సభ్యుల దుస్థితి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుంది.

పెద్ద పెద్ద చదువులు చదువుకోకపోయినా..వారి మనోవేదనలతో ప్రశ్నల రూపంలో వెళ్లగక్కుతున్నారు. నా భర్త నేరం చేశాడని కోర్టు నమ్మితే శిక్ష వేయండి..అది న్యాయం..కానీ నేరం చేసినోళ్లని కోర్టు శిక్షించాలె..కానీ పోలీసులు కాల్చుడేంది ఇది న్యాయమా సార్..అన్యాయం అని అంటోంది ఏడు నెలల గర్భంతో ఉన్న ఏ4 నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక. ఎంతో మంది నేరాలు ఘోరాలు చేసినవారు ఉన్నారనీ..నేరం చేసినవారు  జైల్లో సంవత్సరాల తరబడి ఉన్నారనీ..వాళ్లను ఎందుకు ఇప్పటివరకూ చంపలేదని ప్రశ్నిస్తోంది.

ఎమ్మెల్యే కొడుకులు కూడా రేప్ లు చేసినోళ్లు..హత్యలు చేసినోళ్లు ఉన్నారు వాళ్లలో ఒక్కరికైనా శిక్ష పడిందా?.వాళ్లను ఎవ్వరైనా సంపారా అని ప్రశ్నిస్తోంది.  నేరం చేసి జైల్లో ఉన్నవారిని కూడా వీళ్లను చంపినట్లే చంపాలని..వాళ్లను కూడా ఇలాగే సంపేలని డిమాండ్ చేస్తోంది.

నేరం జరిగిందని పోలీసులు సెప్పినాక..తన భర్త చెన్నకేశవుల్ని మాట్లాడలేదనీ..కనీసం  కంటితో చూసే అవకాశాన్ని కూడా పోలీసులు కల్పించలేదనీ వాపోయింది. నా భర్తను సంపేత్తారని తెలిస్తే కనీసం కంటితోనైనా చూసుకునేవాళ్లం కదా..వాడు నేరం చేసి ఉన్నాగానీ కడసారైనా చూసుకునేదాన్ని కదా సార్..అని ఏడుస్తోంది. ఎంతైనాసగటు భారత స్త్రీ కదా..భర్త తప్పు చేసినా..నేరం చేసినా క్షమించేసే పెద్ద మనస్సు ఉన్న సగటు స్త్రీగా ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. మేం గరీబోళ్లమనే కదా..మా గురించి అడిగేవాళ్లు లేరనే  గదా సార్..గిట్లా సంపేసిండు అంటోంది. కోర్టులో పెట్టి కోర్టు మరణశిక్ష ఏసినా సంపేస్తే కాదని ఎవరు అంటారు సార్..అని ప్రశ్నిస్తోంది.   

ఎంత పెద్ద నేరం చేసినోళ్లనైనా కుటుంబ సభ్యులతో మాట్లాడిపిస్తారు కదా సార్..అటువంటి అవకాశమే మాకు లేకుండా చేసిండు కదా సార్..అంటూ అమాయకత్వంతో కూడిన ఆవేదనతో ప్రశ్నిస్తోంది.