Jeevan Reddy: కాంగ్రెస్‌లో ఉండలేక..వీడలేక.. మాజీమంత్రి జీవన్‌రెడ్డి డెసిషన్ ఏంటి?
కాంగ్రెస్ పార్టీని వీడాలని డిసైడ్ అయిన జీవన్‌రెడ్డి..ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయనకు కీలక పదవి అప్పగిస్తారంటూ టాక్ వినిపిస్తోంది.
- ఉగాది తర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కడం ఖాయమా?
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జీవన్ రెడ్డి టచ్ లోకి వెళ్ళారా?
- గతంలో కేకే చేపట్టిన పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వబోతున్నారా?
- బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి, ఎల్.రమణ కలిసి పని చేసేనా?
- జీవన్‌రెడ్డి చేరికతోనే రంగంలోకి గులాబీ బాస్ కేసీఆర్..!
Jeevan Reddy: హస్తం గూటిలో ఉండలేకపోతున్నారు. అలా అని కాంగ్రెస్‌ను వీడుతానని కరాఖండిగా చెప్పలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లుగా సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు మాజీమంత్రి జీవన్‌రెడ్డి. కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదంటారు. ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది ఎమ్మెల్యే సంజయే అంటారు. అలాగని ఎప్పుడు హస్తానికి హ్యాండ్ ఇస్తారో చెప్పలేని పరిస్థితి. జీవన్‌రెడ్డి అధికార పార్టీకి గుడ్‌బై చెప్పేయడం ఖాయమా? ఉగాది తర్వాత కారెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? ఆయనకు ఏ పదవి ఇవ్వాలో కూడా గులాబీదళం డిసైడ్ అయిపోయిందా?
కుండబద్దలు కొట్టినట్లు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు చెప్పట్లేదు. అలా అని హస్తం పార్టీలోనే ఉంటానని కూడా స్పష్టత ఇవ్వట్లేదు. కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితులు లేవంటున్నారు. కానీ రాజీనామాపై మాత్రం ఔట్ రైట్ క్లారిటీ ఇవ్వట్లేదు. ఉగాది తర్వాత అన్ని విషయాలు చెప్తానంటున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. హస్తం పార్టీని వీడి..కారెక్కేందుకు రెడీ అవుతున్నట్లు జీవన్ రెడ్డి తన అనుచరులకు సంకేతాలు ఇచ్చేశారని అంటున్నారు.
జగిత్యాలలోని తన ఇంటి ముందున్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. అలాగే కాంగ్రెస్ జెండాలు ఎక్కడా కనబడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే అదేం కాదు..ఇంకా తన ఇంటి ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల ఫ్లెక్సీ ఉందంటూ కవర్ చేస్తున్నారు పెద్దాయన. అలా అని హస్తం గూటిలోనే ఉంటానని అనుకుంటే పొరపాటే అని చెప్పుకొస్తున్నారు. జీవన్‌రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా..ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 25న తన అనుచరులతో కలిసి కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ కాడి దించేసి..కారెక్కాలని డిసైడ్ అయిన జీవన్‌రెడ్డి..ఉగాది తర్వాతే హస్తం పార్టీకి రాజీనామాపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు. అయితే ఆయన మీడియా ముందుకు రావడంతో రాజీనామా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఎమ్మెల్యే సంజయ్‌పై విమర్శల దాడికే పరిమితం అయ్యారు. తనతో కలిసి పని చేయాలని ఎమ్మెల్యే సంజయ్ తనకు ఆఫర్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు..తనను ఎలా కలిసి రమ్మంటారంటూ మండిపడ్డారు.
సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్‌లో కలిసి పని చేయాలని సంజయ్ అంటుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరని క్వశ్చన్ చేశారు జీవన్‌రెడ్డి. తాను పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా? తమ పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయే కదా అంటూ జీవన్‌రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఎంత ప్రశ్నించినా కాంగ్రెస్‌ను వీడటంపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న మిత్రులు తనతో మాట్లాడుతున్నారని..తన వాదనేంటో వారికి వినిపిస్తున్నానని చెప్పుకొస్తున్నారు. ఎట్టకేలకు పార్టీలో ఉండలేనని చెప్తున్నారు జీవన్‌రెడ్డి. ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ పార్టీ కార్యక్రమాలకు దూరం పెడితేనే తాను కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతానంటూ కుండబద్దలు కొట్టేశారు.
కాంగ్రెస్ పార్టీని వీడాలని డిసైడ్ అయిన జీవన్‌రెడ్డి..ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయనకు కీలక పదవి అప్పగిస్తారంటూ టాక్ వినిపిస్తోంది. గతంలో కే.కేశవరావును నియమించినట్టే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవిని కట్టబెట్టే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీవన్‌రెడ్డి సీనియారిటీని గుర్తించి..ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసి.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎల్.రమణ బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదే నిజమైతే బీఆర్ఎస్లోనూ జీవన్‌రెడ్డికి పోరు తప్పదన్న గుసగుసలు మొదలయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా లేకపోతే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు..పార్టీలో చేరిన వెంటనే సెక్రటరీ జనరల్ పదవిని ఇస్తామన్న హామీతోనే కారెక్కేందుకు రెడీ అవుతున్నారట జీవన్‌రెడ్డి. అటు గులాబీ బాస్ కేసీఆర్ కూడా జీవన్‌రెడ్డి చేరికతోనే మళ్లీ రంగంలోకి దిగబోతున్నారని అంటున్నారు. జగిత్యాలలో బహిరంగ సభలో జీవన్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరతారని టాక్ నడుస్తోంది. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటం కన్ఫామా? లేదంటే వచ్చే ఎన్నికల దాకా ఇలాగే సాగదీస్తారో వేచి చూడాలి.
