‘Disha’ Incident : నలుగురు కలిసి ప్లాన్ చేశారు. స్కూటీ పంక్చర్ పేరుతో డ్రామా ఆడారు. నమ్మించి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై సజీవదహనం చేశారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున దిశను చంపేశారు. ఆపై పోలీసుల ఎన్‌కౌంటర్లలో నిందితులు నలుగురూ చనిపోయారు. దిశ అత్యాచారం, హత్య ఘటనకు 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారంతో ఏడాది పూర్తయింది. దిశ ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 2019, నవంబర్ 27న జరిగింది.
హైదరాబాద్ శివారులోని తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో నలుగురు యువకులు వెటర్నరీ డాక్టర్ దిశ పార్క్ చేసిన బైక్ టైర్ గాలితీశారు. సాయంత్రం తిరిగొచ్చిన ఆమెను.. పంక్చర్ చేయిస్తామని నమ్మించారు. బైక్‌ను పంక్చరు షాపుకు తీసుకెళ్తున్నట్టు డ్రామా ఆడి బలవతంగా లారీలో ఎక్కించారు. అక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి… ఆ తర్వాత సజీవ దహనం చేశారు.
https://10tv.in/prime-ministers-hyderabad-tour-schedule/
మరునాడు బ్రిడ్జికింద దిశ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మరుసటి రోజే మర్డర్ మిస్టరీని చేధించారు. దిశపై అత్యాచారం చేసి చంపేసినట్టు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
దిశ అత్యాచారం, హత్య ఘటనపై తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరిగింది. దిశ హత్య జరిగిన పది రోజులకు… అంటే డిసెంబర్ 6వ తేదీన నలుగురు నిందితులను సీన్ -రీకన్‌స్ట్రక్షన్ కోసం తెల్లవారుజామున ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. నిందితులు పోలీసులపై తిరగబడడంతో… ఘటనా స్థలంలోనే నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పోలీసులకు ప్రజలంతా సలాం చేశారు.
మరోవైపు దిశ ఎన్‌కౌంటర్‌పై మానవహక్కుల సంఘంతోపాటు పలు ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్దేశపూర్వకంగానే నిందితులను చంపేశారంటూ పోలీసులపై ఫిర్యాదులు కూడా చేశాయి. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మానవ హక్కుల సంఘాల పిటిషన్లపై విచారించిన సుప్రీం… తాము చెప్పే వరకు డెడ్‌బాడీలకు అంత్యక్రియలు నిర్వహించొద్దని ఆదేశించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తుల బృందం దిశ ప్యామిలీతోపాటు.. నిందితుల కుటుంబ సభ్యులనూ విచారించి నివేదికను సుప్రీంకు సమర్పించింది. దాదాపు మూడు వారాల తర్వాత నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికీ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది.
దిశ సంఘటన తర్వాత పోలీస్ శాఖలో కొన్ని కీలకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా జీరో ఎఫ్‌ఐఆర్ అనే విధానాన్ని పటిష్టం చేశారు. అంతకుముందు కూడా ఈ విధానం అమలులో ఉన్నా… దిశ ఘటన తర్వాత దీన్ని పటిష్టం చేయాలని పోలీస్‌శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే డయల్ 100కు వచ్చే కాల్స్ పట్ల నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మహిళలు, విద్యార్థినులు, యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. ఏపీలో దిశ పేరుతో మహిళల సమస్యల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.