Kamareddy Congress: కామారెడ్డి కాంగ్రెస్ సభలో “టీఆర్ఎస్” స్టిక్కర్ కలకలం
ఎల్లారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన "మన ఊరు మన పోరు" సభాస్థలి వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ తో కూడిన కారు కలకలం సృష్టించింది
- Bharath Reddy
- Published On : March 20, 2022 / 03:18 PM IST
Congress
Kamareddy Congress: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “మన ఊరు మన పోరు” సభాస్థలి వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ తో కూడిన కారు కలకలం సృష్టించింది. శనివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరుపైన ఉన్న స్టిక్కర్ తో ఇన్నోవా వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొంతసేపు సభా స్థలి వద్ద వీరంగం సృష్టించిన ముగ్గురు వ్యక్తులు.. సభను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అక్కడి నుంచి తరలించారు.
ఆదివారం సభ ప్రారంభమయ్యే వరకు ఆ కారును అక్కడే బంధించారు కాంగ్రెస్ కార్యకర్తలు. కారు యజమాని వస్తేనే కారును పంపిస్తామని అన్నారు. ఇదిలాఉంటే ఆ కారు.. కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేత మదన్మోహన్ రావు బంధువుది అంటూ వార్తలు వచ్చాయి. ఎల్లారెడ్డి సభలో ఏర్పాటు చేసిన మదన్మోహన్ రావు ఫ్లెక్సీని కొందరు దుండగులు చించివేశారు. మరో కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డి అనుచరులే ఈ ఫ్లెక్సీలను చించివేశారంటూ మదన్మోహన్ రావు వర్గీయులు ఆరోపించగా..సభను అడ్డుకునేందుకు వచ్చిన కారు మదన్మోహన్ రావు బంధువుదే అంటూ సుభాష్ రెడ్డి వర్గీయులు ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య పోరుతో ఎల్లారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
Also read: Hyderabad Traffic Police: బ్లాక్ స్టిక్కర్స్ పై కొరడా ఝళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
