పెళ్లి పెద్దగా మారి అనాథ యువతికి వివాహం జరిపించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

ఇవాళ కలెక్టరేట్‌లోని వెంకటేశ్వరస్వామి మందిరంలో పెళ్లి జరిగింది.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెళ్లి పెద్దగా మారి ఓ అనాథ యువతికి వివాహం జరిపించారు. పెద్దపల్లి కలెక్టరేట్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయ కల్యాణ మండపంలో అనాథ యువతి మానసకు రాజేశ్‌ అనే యువకుడితో వివాహం జరిగింది.

ఆ జంట పేరిట రూ.61,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. నూతన జంటను శ్రీహర్ష, జిల్లా అధికార యంత్రాంగం ఆశీర్వదించారు. మానస అనే అమ్మాయి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది.

రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో పెరిగింది. అదే కేంద్రంలో మానస చెల్లి కూడా పెరిగింది. 16 ఏళ్లుగా అక్కడే ఉంటున్న మానసకు జనగామ జిల్లాలోని రఘనాథపల్లికి చెందిన రాజేశ్‌ అనే యుకువడితో పెళ్లి కుదిరింది. మానస వివాహం జరిపించేందుకు కొన్ని రోజుల నుంచి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

ఇవాళ కలెక్టరేట్‌లోని వెంకటేశ్వరస్వామి మందిరంలో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి పెద్దపల్లి జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావు సహా అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జరిపించారు. వధువుకు పెళ్లిపెద్దగా వ్యవహరించేందుకు శ్రీహర్ష ముందుకు వచ్చారు.