Red Sand Boa : అరుదైన పాము.. అదృష్ట చిహ్నం.. రూ.కోట్లలో ధర.. ఎలా పట్టుబడిందంటే..!

Red Sand Boa : రూ. కోట్లలో ధర పలికే అరుదైన రెండు తలల పాము అక్రమ రవాణాను అడ్డుకున్నారు.

dri officials rare red sand boa two headed snake rescued in warangal

Red Sand Boa : వరంగల్‌లో అరుదైన ఎర్ర ఇసుక బోవా పాముల (రెండు తలల పాము) అక్రమ రవాణా గుట్టు రట్టయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ గ్రే మార్కెట్‌లో సజీవ పాముల అక్రమ విక్రయానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై డీఆర్‌ఐ (DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు నిఘా పెట్టారు. దీనిలో భాగంగా అధికారులు మే 17న అండర్‌కవర్ డీకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో డీఆర్ఐ బృందం అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా రెండు సజీవ ఎర్ర ఇసుక బోవా పాములను [ఇండియన్ రెడ్ శాండ్ బోవా (Eryx johnii) పాములు] స్వాధీనం చేసుకున్నారు.

ఈ జాతి పాములు వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్–1972 షెడ్యూల్–Iలో నమోదైన అరుదైన జీవులుగా గుర్తించారు. చట్టం ప్రకారం ఈ జాతి పాములను కలిగి ఉండటం, కొనుగోలు–అమ్మకాలు నిర్వహించడం నేరం. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులు… నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పాములు, ప్యాకింగ్ సామగ్రి, నిందితుడిని వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు అప్పగించారు.

అటవీ శాఖ అధికారులు.. నిందితుల మీద వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద తదుపరి చర్యలు చేపట్టారు. అరుదైన వన్యప్రాణుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే మన దేశంలో ఈ రెండు తలల పామును అదృష్టానికి మారుపేరుగా నమ్ముతారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. వీటికి కోట్లలో డబ్బులు చెల్లించేందుకు ముందుకు వస్తారు. దీనితో క్షుద్ర పూజలు చేస్తే ధనవంతులు అవుతారని చాలా మంది నమ్ముతారు.