×
Ad

Gachibowli Hit and Run Case : గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి.. కారుతోపాటు ఈడ్చుకెళ్లిన యువకుడు..

Gachibowli Hit and Run Case : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో కారును నడిపిన యువకుడు.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను ఢీకొట్టడంతోపాటు.. కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు.

Gachibowli Hit and Run Case

  • గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బెంజ్ కారు బీభత్సం
  • మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసిన యువకుడు
  • కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన వైనం
  • యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Gachibowli Hit and Run Case : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో కారును నడిపిన యువకుడు.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను ఢీకొట్టడంతోపాటు.. కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు కారు డ్రైవ్ చేస్తున్న తరుణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా.. అల్కహాల్ శాతం 160 ఎంజీగా నమోదైంది. దీంతోపాటు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Pending Challans : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై భారీగా డిస్కౌంటా..? ‘ఎక్స్’లో వీడియో షేర్ చేసి క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్.. చర్యలు తప్పవంటూ వార్నింగ్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. నార్సింగిలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్న గుర్రంపాటి తరుణ్ (24) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకొని వచ్చాడు. శనివారం తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు మద్యం సేవించారు. మద్యం మత్తులో బెంజ్ కారును డ్రైవ్ చేసుకుంటూ నార్సింగి నుంచి కూకట్‌పల్లి వెళ్లేందుకు బయలుదేరాడు.

మద్యం మత్తులో ఉన్న తరుణ్ నానక్‌రాంగూడ వద్ద ఓ కారును ఢీకొట్టాడు. అయినా ఆగకుండా వెళ్లి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి.. ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ వైపు దూసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీస్ కానిస్టేబుల్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ లో కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ, తరుణ్ మాత్రం కారును వేగంగా పోనివ్వడంతో.. కానిస్టేబుల్ కారు బానెట్‌పై పడిపోయారు. అప్పటికీ తరుణ్ కారును ఆపకుండా వేగంగా పోనిచ్చాడు.. కానిస్టేబుల్ కారు బానెట్ ‌పై వేలాడుతుండగానే కారును పోనిచిచ్చాడు. కొద్దిదూరంలో యూటర్న్ తీసుకునే క్రమంలో వాహనాలు అడ్డు రావడంతో కారును స్లో చేయడంతో కానిస్టేబుల్ కారు బానెట్ పై నుంచి కిందకు దిగాడు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పోలీసులు తరుణ్‌ను కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతనికి 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు అతన్ని తరలించారు. తరుణ్ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి వైద్యురాలు అని తెలుస్తోంది.