Rajya Sabha Polls Representative Image (Image Credit To Original Source)
Rajya Sabha Polls: దేశవ్యాప్తంగా త్వరలో 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఈ రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 5 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణకు గడువు. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈసారి తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏప్రిల్ 9న ప్రస్తుత సభ్యులు అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కడం దాదాపు ఖాయం. ఉన్నవి రెండు సీట్లు.. ఆశావహులు మాత్రం భారీగానే ఉన్నారు. అయితే మరోసారి అభిషేక్ సింఘ్వికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. మరో స్థానం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేకే, వీహెచ్, ఇరవత్రి అనిల్, టి వెంకట్రామి రెడ్డి (డెక్కన్ క్రానికల్) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యాక అభ్యర్థులపై క్లారిటీ రానుంది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం ఒక్కో రాజ్యసభ సీటు గెలవడానికి సుమారు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల మద్దతూ ఉంది. దీంతో రెండు స్థానాలను ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్లు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు ఈ సీట్లపై కన్నేశారు. ఈసారి తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
మహారాష్ట్రలో 7 రాజ్యసభ స్థానాలు, తమిళనాడులో 6, బిహార్ లో 5, వెస్ట్ బెంగాల్ లో 5, ఒడిశాలో 4, అసోంలో 3, తెలంగాణలో 2, హర్యానాలో 2, ఛత్తీస్ గఢ్ లో 2, హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో శరద్ పవార్, ప్రియాంక చతుర్వేది, రాందాస్ అధవాలె, తమిళనాడులో తిరుచ్చి శివ, వెస్ట్ బెంగాల్ లో సాకేత్ గోకలే వంటి కీలక నేతల పదవీ కాలం ముగియనుంది.
Also Read: మున్సిపోల్స్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు.. ఏమేం జరిగాయంటే?