ED Auctions Seized Aircraft : దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ఈడీ.. ఎంతకు విక్రయించారంటే?

ED Auctions Seized Aircraft : దేశంలోనే తొలిసారిగా ఈ-వేలంలో విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విక్రయించింది.

ED Auctions Seized Aircraft

  • దేశంలోనే తొలిసారి..
  • వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ
  • రూ.3కోట్లకు విక్రయం

ED Auctions Seized Aircraft : దేశంలో తొలిసారిగా అక్రమ ఆస్తుల స్వాధీనం ప్రక్రియలో భాగంగా ఒక విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వేలం వేసింది. ఫాల్కన్ గ్రూప్‌నకు సంబంధించిన భారీ పోంజీ స్కీం కేసులో స్వాధీనం చేసుకున్న హాకర్ 800ఏ (Hawker 800A) ప్రైవేట్ జెట్‌ను రూ.3కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ వేలం ప్రక్రియను జులై 1వ తేదీన హైదరాబాద్ జోనల్ కార్యాలయం ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ద్వారా ఈడీ నిర్వహించింది.

Also Read : Jupally Krishna Rao : రాష్ట్ర అప్పులపై నా లెక్కలు తప్పని కేసీఆర్‌తో మాట్లాడించగలరా? తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. మంత్రి జూపల్లి

ఈ విమానాన్ని 2025 మార్చి 7వ తేదీన హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇది క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, దాని సీఎండీ అమర్‌దీప్ కుమార్ తదితరులపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించినదిగా ఈడీ గుర్తించింది. అనంతరం పీఎంఎల్ఏ న్యాయ అధికారుల అనుమతితో విమానాన్ని వేలం వేసింది.

దర్యాప్తు ప్రకారం.. ఫాల్కన్ గ్రూప్ పేరుతో నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చూపించి, పెట్టుబడిదారులకు అధిక లాభాల ఆశజూపి సుమారు రూ.792 కోట్ల మేర మోసం చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసు ఆధారంగా సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌లపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, విమానం విక్రయం ద్వారా రూ. 3కోట్లు రాగా.. ఆ మొత్తాన్ని ప్రత్యేక కోర్టు ఆమోదానికి లోబడి, పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం.. నిజమైన పెట్టుబడిదారులకు పరిహారం చెల్లించడానికి వినియోగిస్తామని ఈడీ తెలిపింది.

దర్యాప్తు క్రమంలో అమర్‌దీప్ కుమార్ సోదరుడైన సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శరద్ చంద్ర తోష్నివాల్, ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సీఈవో ఆర్యన్ సింగ్ ఛబ్రాలను కూడా ఈడీ అరెస్టు చేసింది. 2025 సెప్టెంబర్ 29న సంబంధిత న్యాయ స్థానంలో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేయగా.. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది.