Polling Stations Increase: తెలంగాణ ఓటర్లకు ఈసీ గుడ్ న్యూస్.. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంపు.. ఇకపై ఇంట్లో అందరూ ఒకే చోట
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Polling Stations Increase)ప్రక్రియకు ఈసీ అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
- V Santhosh Kumar
- Published on- August 12, 2026 / 09:07 PM IST
Election Commission green signal to increase polling stations in Telangana.
- తెలంగాణలో పోలింగ్ కేంద్రాల పెంపు.
- మొత్తం 36,353 కేంద్రాలు ఖరారు.
- ఒకే చోట కుటుంబ ఓట్లు.
Polling Stations Increase: తెలంగాణరాష్ట్రంలో ఓటర్ల సౌకర్యాన్ని మెరుగుపరచడం, పోలింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ (ఈసీ) కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ(Polling Stations Increase) ప్రక్రియకు ఈసీ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఓటర్లకు సులువుగా అందుబాటులో ఉండేలా, పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అవసరమైన ప్రాంతాల్లో నూతన కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది.
368 నూతన కేంద్రాల పెంపు:
ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 368 పోలింగ్ కేంద్రాలను పెంచారు. దీంతో తెలంగాణలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 36,353కు చేరుకుంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా రాజధాని హైదరాబాద్ జిల్లాలోనే 4,094 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 308 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఒకే కేంద్రంలో కుటుంబ ఓట్లు:
ఈసారి చేపట్టిన హేతుబద్ధీకరణలో ఓటర్ల కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించింది. గతంలో ఒకే ఇంట్లోని సభ్యులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలు కేటాయించడం వల్ల ఎదురైన ఇబ్బందులను గమనించిన ఈసీ.. కుటుంబసభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటు వేసేలా మార్పులు, చేర్పులు పూర్తి చేసింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ఓటర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
