Etela Rajender : బీజేపీలోకి ఈటల రాజేందర్.. ముహూర్తం ఫిక్స్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల..

Etela Rajender : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13న ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరనున్నారు. అదే రోజు ఆయన వెంట పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం మాజీ నేత తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ తన అభిమానులు, హుజూరాబాద్ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపారు. ఈటల బీజేపీలో చేరాక పలు గ్రామాలకు చెందిన కేడర్ కూడా ఆ పార్టీలోకి వస్తుందని చెబుతున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మూడు రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు ఈ రోజు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు స్పీకర్‌ను కలిసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను అందించనున్నట్లు సమాచారం.

అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఈటల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. ”రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని, ఉరిశిక్ష పడే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నా గురించి తెలుసుకోకుండా విచారణకు అదేశాలు ఇచ్చారు. నా ప్రాణం ఉండగానే బొందబెట్టాలని చూశారు. హుజూరాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నాం.

ఓ అనామకుడు ఉత్తరం రాస్తే మంత్రిపై చర్యలు తీసుకున్నారు. నాపై జరుగుతున్న దాడి, కుట్రలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై చర్యలకు సిద్ధమయ్యారు. 19 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్‌లో ఉన్నా.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు” అని ఈటల అన్నారు.

ట్రెండింగ్ వార్తలు