Mla Raja Singh: ఆ కమిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా- ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
కిషన్ రెడ్డి, నేను ఇద్దరం రాజీనామా ఇద్దాం. ఎవరు ఎక్కడ గెలుస్తారో చూద్దాం. కమిటీ ఏర్పాటులో కిషన్ రెడ్డి హస్తం ఉంది.

Mla Raja Singh: గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ బీజేపీనే అని ఆయన తేల్చి చెప్పారు. ప్రతి కార్యకర్తకు మద్దతుగా ఉంటానని తెలిపారు. తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదన్నారు. రాంచందర్ రావు రబ్బర్ స్టాంప్ గా మారొద్దని రాజాసింగ్ కోరారు. తెలంగాణలో ఎవరి వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుందో తాను సర్వే చేసి చెప్తానన్నారు. తాజా బీజేపీ కమిటీతో అధికారంలోకి రావడం కష్టం అన్నారు. ఒకవేళ ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.
బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ లో తనను టార్గెట్ చేస్తూ మాట్లాడారని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. స్టేట్ కమిటీపై మాట్లాడటానికి నీకే అధికారం ఉందని అంటున్నారు అని అన్నారు. రాజీనామా చేసిన తర్వాత కూడా బీజేపీ కోసం పని చేస్తానని ఆరోజే చెప్పానని రాజాసింగ్ గుర్తు చేశారు.
”కమిటీలో ఒకటే పార్లమెంట్ నుండి 10 నుండి 12 మంది ఉన్నారు. గతంలో నేను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన జిల్లాలో ఉన్న వ్యక్తులకు ప్రపోజల్ పెట్టాను. కానీ వాళ్లకు నచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారు. ఈ కమిటీ రామచందర్ రావు వేశారా? మా అన్న కిషన్ రెడ్డి వేశారా? తెలంగాణలో ఈ కమిటీతో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ కమిటీతో ప్రభుత్వాన్ని ఫామ్ చెయ్యగలరా? ఎమ్మెల్యేలు, ఎంపీలతో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కొత్త కమిటీతో ఎంపీలందరూ హ్యాపీగా ఉన్నారా? కొత్త కమిటీ విషయంలో బీజేపీ నాయకులు ఎవరూ సంతృప్తిగా లేరు.
మేము పంపించిన కార్యకర్తల పేర్లు పక్కన పెడుతున్నారు..
మేము పంపించిన కార్యకర్తల పేర్లు పక్కన పెడుతున్నారు. రామచందర్ రావు మంచి మనిషే, కానీ రబ్బర్ స్టాంప్ అయిపోయారు. గతంలో నాపై మహిళలతో ప్రెస్ మీట్ లు పెట్టి తిట్టించారు. ఒక వ్యక్తిపై కామెంట్ చేసేటప్పుడు మన తప్పేముందో కూడా చూసుకోవాలి.
వేముల అశోక్ గతంలో జాబ్ లు ఇప్పిస్తానని మోసం చేశారని మీ వాళ్లే నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. నేను మా బీజేపీ కార్యకర్తల వల్లే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాను. మళ్ళీ వాళ్ళే నన్ను గెలిపిస్తారు. బీజేపీ కోసం, కార్యకర్తల కోసం వేదిక చెప్పండి నేనే వచ్చి మాట్లాడతా, కొట్లాడతా. జిల్లాల్లో బీజేపీ అభివృద్ధి ఎలా చేస్తారో కమిటీ నిర్ణయించాలి.
మీరెవరు రాజీనామా అడగడానికి? కిషన్ రెడ్డి, నేను ఇద్దరం రాజీనామా ఇద్దాం. ఎవరు ఎక్కడ గెలుస్తారో చూద్దాం. కమిటీ ఏర్పాటులో కిషన్ రెడ్డి హస్తం ఉంది. రామచందర్ రావుకి సంబంధం లేదు. రాజాసింగ్ ఎప్పటికీ ఏక్ నిరంజన్. జాతీయ నాయకులు అమిత్ షా, యోగి దీవెనలు నాపై ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటికీ ఉన్నాయి.
కార్యకర్తలను గుర్తించండి.. వాళ్లకు అవకాశాలు ఇవ్వండి. అదే మా బాధ. నల్గొండలో అమిత్ షా మీటింగ్ లో వేళ్లు పెట్టి చూపించాను. ఎవరి వల్ల పార్ట్ నష్టపోతుందో అని. కార్యకర్తలు బాధపడొద్దు అందరికీ పదవులు వస్తాయి. నాకు జరిగిన అన్యాయం గురించి ఢిల్లీలో చెప్పడానికి టైమ్ వస్తుంది. బీజేపీ ఎప్పటికీ నా బీజేపీనే. నేను ఇచ్చిన ప్రతి మెసేజ్ కార్యకర్తలు సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది.
మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. పదవులను నేనెప్పుడూ ఆశించలేదు. రామచందర్ రావు రబ్బర్ స్టాంప్ గా మారొద్దు. ఎవరి వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుందో నేను కూడా సర్వే చేసుకొని చెప్తా. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా నియామకమైన అశోక్ అనే వ్యక్తి నాపై మాట్లాడారు. ఆయన నా గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉండేది. మీరు ఎయిమ్స్ బీబీనగర్ లో జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు దండుకున్నారని మీ వెనకున్న వారే నాకు కాల్ చేసి చెప్పారు. రాంచందర్ రావు ఇంటి ముందు భార్యాభర్తలు పెట్రోల్ పోసుకున్నారు. అలాంటిది ఏం చేశారో ఏమో పార్టీ పదవి దక్కింది. మీకు వచ్చిన పోస్టును కాపాడుకో.. నాపై మాట్లాడితే నీకే నష్టం” అని హెచ్చరించారు రాజాసింగ్.