fire accident in old city gowlipura high school: హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర శ్రీనివాస హై స్కూల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో స్కూల్లో 50మంది పిల్లలున్నారు. సకాలంలో మంటలు ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పిల్లలు సురక్షితంగా బయట పడ్డారు. గురువారం(ఫిబ్రవరి 4,2021) మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
శ్రీనివాస హైస్కూల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఆఫీసు నుంచి తొలుత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన పాఠశాల సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో పాఠశాలకు సంబంధించిన రికార్డులు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
కాగా, ప్రాణాపాయం తప్పడంతో, విద్యార్థులంతా సురక్షితంగా ఉండటంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ స్టాఫ్ కొంత ఆందోళనకు గురయ్యారు.