CM Revanth Reddy : గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వివాహానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దివ్యాంగుల వివాహానికి రూ.2లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
CM Revanth Reddy
- దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం
- వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీ
- ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతాల్లో కోత
- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోనంలో పనిచేస్తుందని చెప్పారు. రూ.50కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా రూ. 50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
Also Read : CM Revanth Reddy : త్వరలో జిల్లాల పునర్విభజన.. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ.. ఆ ప్రాంతాలపై ఫోకస్
విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి కేటాయిస్తున్నాం. దివ్యాంగుల వివాహానికి రూ.2లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా.. లేదా సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకున్నా రూ.2 లక్షలు సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి నేరుగా లబ్దిదారుల అకౌంట్లో వీటిని జమ చేస్తామని స్పష్టం చేశారు.

క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాం. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలని సూచించారు.
బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి. వైకల్యం అనే ఆలోచనను రానీకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో-ఆప్షన్ మెంబర్‌గా ఒక ట్రాన్స్‌జెండర్‌ని కార్పొరేటర్‌గా నామినేట్ చేయాలని సూచిస్తున్నా. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. దీనిపై సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సీఎం రేవంత్ అన్నారు.
వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తాం. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా 10శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే మా విధానం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నాం. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోంది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం. తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించింది. తెలంగాణ కులగణన మోడల్ ను దేశం అనుసరిస్తోందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని, ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశంలేని ప్రజాభవన్‌లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించామని, ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది.. ఎవరు ఏ సమస్యలు చెప్పినావిని పరిష్కరిస్తుంది.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
