Telangana Govt : తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి ఆ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే?
Telangana Government : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Telangana farmers
- రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
- సన్నధాన్యంకు బోనస్ డబ్బులు విడుదల
- నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
Telangana Govt : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతుల (Farmers) కు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమకానున్నాయి.
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో సన్నరకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా క్వింటాకు 500 రూపాయల బోనస్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ తాజాగా 500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన 500 కోట్లతోకలిపి.. ఈ సీజన్లో ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం 1,429 కోట్ల రూపాయల బోనస్ నిధులను విడుదల చేసినట్లయింది.
రైతులు దొడ్డు రకాల కంటే సన్నరకాలను ఎక్కువగా సాగుచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇదే సమయంలో పంట విక్రయం సమయంలో రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా గ్రామాల్లో ఐకేపీ, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి.. రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాకు రూ.500 అదనపు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలను నమోదు చేసి.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే రూ.500 బోనస్ మొత్తాన్ని జమ చేస్తున్నారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగుతోంది. సంక్రాంతి పండుగ వేళ రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
