తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి ఒకేసారి ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వాస్తవానికి 2020, మార్చి 18వ తేదీ బుధవారం సాయంత్రం వరకు కొవిడ్-19 కేసులు 6 నమోదయ్యాయి. రాత్రి 10 గంటల సమయంలో కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరో ఏడు కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది. మొత్తంగా బుధవారం ఒక్క రోజే తెలంగాణలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి పెరిగింది. దీంతో తెలంగాణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇండోనేషియా నుంచి వచ్చిన 11మందిలో ఏడుగురికి కరోనా:
కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారే. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో S9 బోగిలో వచ్చారు:
ఇండోనేషియా నుంచి 11మంది ఢిల్లీకి వచ్చారు. వారంతా మత(ఇస్లామిక్) ప్రచారకులు. మార్చి 14న ఢిల్లీ నుంచి రైలులో(సంపర్క్ క్రాంతి-ఎస్9 బోగీలో) రామగుండం చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో కరీంనగర్ వచ్చారు. ప్రార్థనా మందిరంలో మత కార్యక్రమాలు నిర్వహించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారి గురించి అధికారులకు మార్చి 16న తెలిసింది. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరినీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో వారి శాంపిల్స్ సేకరించి పుణె ల్యాబ్‌కు పంపారు. బుధవారం రాత్రి రిపోర్ట్స్ అందగా అందులో ఏడుగురికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన 11 మంది మత ప్రచారకుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఎస్9 బోగీలో ఉన్నవాళ్లందరూ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.
కరీంనగర్ నగరంలో కర్ఫ్యూ వాతావరణం:
ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కరీంనగర్ లో 48 గంటలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కలెక్టరేట్ పరిధిలోని ఓ ప్రార్థనా మందిరంలో వారంతా గడిపినట్టు అధికారులు గుర్తించారు. దీంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ కేంద్రంగా 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. కరీంనగర్ నగరంలో 144 సెక్షన్ విధించిన అధికారులు, వంద ప్రత్యేక బృందాలను గురువారం(మార్చి 19,2020) రంగంలోకి దింపుతున్నారు. వారంతా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు కరోనా వైద్య పరీక్షలు చేయనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇలా వైద్య పరీక్షలు చేయడం తెలంగాణలో ఇదే ఫస్ట్ టైమ్. ప్రజలు నాలుగు రోజుల పాటు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరారు.
రసాయనాలతో ప్రార్థన మందిరాలు శుభ్రం:
కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కరీనంగర్ కలెక్టర్. దీనికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రోడ్డును పూర్తిగా మూసివేశారు. నగరంలో దుకాణాలు, హోటళ్లు మూసివేయించారు. విదేశీయులు బస చేసిన ప్రార్థనా మందిరాలను రసాయనాలతో శుభ్రపరిచారు. ఆ ప్రాంతమంతా మందులు, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అంతేకాదు 144 సెక్షన్‌ను విధించి ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 20 ఐసొలేషన్, 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 చొప్పున బెడ్స్‌ను సిద్ధం చేశారు. కరీంనగర్ నగరమంతటా శానిటైజేషన్ చేశారు. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. ప్రజలను గుమికూడొద్దని ప్రచారం చేస్తున్నారు. అత్యవసరంగా చికిత్స అందజేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
See Also | ఒంగోలులో కరోనా లక్షణాలు : ఏపీలో రెండో పాజిటివ్ కేసు!..హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు
ఇండోనేషియా నుంచి ఢిల్లీ వచ్చిన ఇస్లామిక్ బృందం:
ఇండోనేషియాకు చెందిన ఇస్లామిక్ మత ప్రచారకుల బృందం ఫిబ్రవరి 22న ఢిల్లీ వచ్చింది. వారిలో 11మంది మరో ముగ్గురు భారతీయులతో కలిసి మార్చి 14న కరీంనగర్ వచ్చారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్(12708) S9 బోగిలో రామగుండం వచ్చారు. అక్కడి నుంచి ఓ వాహనంలో కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, మకరంపురలో మసీదుల్లో గడిపారు. మత ప్రచారంలో భాగంగా నగరంలో పలు ప్రాంతాలకు వెళ్లిన వారు పలువురు స్థానికులను కలిశారని అధికారులు తెలిపారు.