Heavy Rains : తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే క్యుములోనింబస్ మేఘాలు, ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
- bheemraj
- Updated on- April 30, 2023 / 07:59 PM IST
Heavy Rains (Photo : Google)
Heavy Rains : తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంది. వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు తీవ్ర ఎండలు కొడుతుంటే మరోవైపు వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే క్యుములోనింబస్ మేఘాలు, ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం (మే1)వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం కరీంనగర్, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదు అయింది.
