Bajireddy Govardhan : ఆ వార్తలు అవాస్తవం.. బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
Bajireddy Govardhan : బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.
- Sreehari A
- Published On : March 11, 2024 / 03:42 PM IST
Former MLA Bajireddy Govardhan
Bajireddy Govardhan : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్షాల అసంతృప్త నేతలపై దృష్టి పెట్టింది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదిశగా హస్తం పార్టీ ముందుకెళ్తోంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. హస్తం పార్టీలో చేరికపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆయన్ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా స్పందించిన బాజిరెడ్డి గోవర్థన్ తీవ్రంగా ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
Read Also : భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై మల్లికార్జున్ ఖర్గే స్పందించాలి : బాల్క సుమన్
కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా :
తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇప్పటికే, పార్టీ అధినేత కేసీఆర్ మూడు సార్లు టిక్కెట్ ఇస్తే.. రెండు సార్లు గెలిపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్‌ను తాను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని బాజిరెడ్డి గోవర్థన్ స్పష్టం చేశారు.
స్వతంత్రంగా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన బాజిరెడ్డి గోవర్ధన్.. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1994లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగానూ, బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో బాజిరెడ్డి గోవర్థన్ చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
Read Also : AP Deputy CM : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కంటతడి.. తండ్రిని చూసి కూతురు కృపాలక్ష్మి ఎమోషనల్!
