Minimum Wages : 1.1 కోట్ల మందికి ప్రభుత్వం శుభవార్త.. వారి జీతాలు పెరగనున్నాయి.. నేటి నుంచే అమలు…

Minimum Wages : రాష్ట్రంలోని సుమారు కోటికి మందికి పైగా సర్కార్ శుభవార్త చెప్పింది. నేటి నుంచి వారి వేతనాలు పెరగనున్నాయి.

from 2026 june 1 telangana hikes minimum wages for workers

  • తెలంగాణ సర్కార్ శుభవార్త
  • 1.1 కోట్ల మందికి పెరగనున్న వేతనాలు
  • నేటి నుంచే అమలు

Minimum Wages : రాష్ట్రంలో పనిచేస్తున్న 1.11 కోట్ల మంది కార్మికులు, వేతన జీవులకు శుభవార్త. వారికి ఇస్తున్న కనీస వేతనాలు సోమవారం అంటే జూన్ 1, నేటి నుంచి పెరగనున్నాయి. దీనికి సంబంధించి కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా మరో 10 రంగాలను చేర్చడంతో.. మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు, వేర్వేరు జీతాలు కాకుండా అందరికీ ఒకేవిధమైన వేతనాల చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకీకృత నమూనాను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం వల్ల కార్మికులకు భారీగా ప్రయోజనం కలగనుంది. దీని ప్రకారం హైలీ స్కిల్డ్ (అత్యంత నైపుణ్యం గల) వర్కర్లకు గరిష్టంగా నెలకు రూ. 20 వేల వరకు వేతనం లభించబోతోంది.

మూడు జోన్లుగా విభజన

వేతనాల ఏకీకృత విధానం కోసం ప్రభుత్వం.. గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలికలు అంటూ మూడు జోన్లుగా విభజించింది. ఆయా జోన్లలో నైపుణ్య కేటగిరీల వారీగా కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతనాలను కార్మిక శాఖ తాజాగా ఖరారు చేసింది. ఈ క్రమంలో నగరపాలికలను జోన్‌-1గా, మున్సిపాలిటీలను జోన్‌-2గా, గ్రామాలు మరియు ఇతర ప్రాంతాలను జోన్‌-3గా ప్రకటించింది. అలానే కొత్తగా హైస్కిల్డ్‌ (హైలీ స్కిల్డ్) కేటగిరీని చేర్చి.. జోన్‌-1లో పనిచేసే కార్మికుల కనీస వేతనాన్ని రూ. 20 వేలుగా నిర్ణయించింది.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటిని సవరించాలంటూ కార్మిక సంఘాలు, వర్కర్ల అసోసియేషన్లు 2022లో హైకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కనీస వేతనాల అంశంపై కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యాల ప్రతినిధులతో ఈ ఉపసంఘం పలుమార్లు సమావేశమై చర్చించింది.

కనీస వేతనాల సలహా మండలి సిఫార్సులను పరిశీలించాలని కోరుతూ కార్మిక శాఖ కమిషనర్‌ మే 31న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించారు. దీన్ని పరిశీలించిన ఉపసంఘం.. నూతన వేతన కోడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్‌ 1 నుంచి పెంచిన కనీస వేతనాలు అమలు చేయాలని సూచించింది.

ఆ సిఫార్సులు, నిబంధనల ప్రకారం…

  • ప్రస్తుతం కార్మికులు పొందుతున్న వేతనాలు.. కొత్తగా అమల్లోకి వచ్చిన కనీస వేతనాల కన్నా ఎక్కువగా ఉంటే, ఆ ఎక్కువ ఉన్న వేతనాలనే కొనసాగించాలి.
  • అలానే వారాంతపు సెలవులు, ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేసే కార్మికులకు ఆ రోజున సాధారణ వేతనంపై రెండింతల జీతం (డబుల్ శాలరీ) చెల్లించాలి.
  • చేసే పని సమానంగా ఉన్నప్పుడు ఆడ, మగ అనే లింగ వివక్ష లేకుండా సమానంగా వేతనాలు చెల్లించాలి.
  • ఒక ఉద్యోగి రోజుకు 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేస్తే.. ఆ సమయంలో సదరు ఉద్యోగికి అదనపు పనిగంటల వేతనం (Overtime) చెల్లించాలి.
  • కాంట్రాక్టర్లు, సర్వీసు ఏజెన్సీల ద్వారా కార్మికులు పనిచేస్తుంటే.. వారందరికీ కూడా కనీస వేతనాలు అమలయ్యేలా, చెల్లించేలా చూసే బాధ్యతను ప్రధాన యజమాని  తీసుకోవాలి.